కవితలు బసవరాజు అప్పారావు గీతాలు 138. నూజవీటి పోతుగడ్డ
138. నూజవీటి పోతుగడ్డ (వాయుసందేశము నుండి)
అడవిమార్గమ్ము లన్నింటి గడచి కడచి,
శర్వరీ సార్వభౌము డపూర్వకీర్తి
వైభవోపేతు డౌచు చెల్వందుచుండ,
శుభ్రపున్‌ జ్యోత్స్న లవనిపై సుస్తి జెంద
గగనతలమున దూరాన గానిపించు
రజతశైలాగ్రసదృశవిరాజమాన
రాజహర్మ్యాగ్రతలములు రాణువొప్పు
నప్పరాయనరేంద్రుల యాటపట్టు!
చుల్కనగ జూడబోయెదు సుమ్ము, మున్ను
మేకపిల్ల తోడేలితో మించి పోరి
నట్టి మేల్పోతుగడ్డ మా పట్టణమ్ము.
ప్రథితవీరావతంసులవాస మయ్యు,
తల్లి మాకోటమహిష మ్మదయ తొలంగ,
వేణుగోపాలు డల్కమై వీడి చనగ,
పతియు బందుగులున్‌ వీడ ధృతి తొలంగి
వేఱుచందమై తోచెడు వెలదివోలె,
పూర్వవిభవచిహ్నములౌ బురుజు లెల్ల
కాలచక్రాహతి న్నేల గూలిపోవ,
నేడు శిథిలమ్ములై కోటగోడ లవిగొ,
పేదలై కనుపట్టుచు ఖేద మొసగు!
వేణుగోపాలు భక్తి సేవించి, పిదప
మాన్యులౌ మత్పూర్వు లమాత్యవరులు
ఆర్యధర్మపద్ధతియు లోకానుభవము
మెండుగ నెఱింగి ఠీవితో నిండుసభను
రాచకార్యాలు దీర్చిన రచ్చచింత
నీడ నొక్కింత నిలిచి, మా వీడు మున్ను
జెలగినట్టి చోటును గాంచి, చెలిమికాని
పూర్వవైభవమున్‌ దలపోసి చనుమ!
పాయె నానాటిపూర్వుల వైభవమ్ము,
మానె వారిపరాక్రమ మహితదీప్తి,
కాలగతి మార్పు లెన్నేని కల్గుచుండు,
చక్రనేమిక్రమమ్మున జగతిలోన!
వేసవిన్‌ దాహముం గొన్న పిట్టలకును
దొన్నెల న్నీరు వోయించి, యెన్నతరము
కాని భూతదయన్‌ దోమకాటుగన్న
పసులు మేను రాచికొనగ బండరాళ్ళ,
గొల్లభామలు బరువైన చల్లకుండ
లమరు తట్టల దింప వీలైన యెత్తు
రాలదిమ్మ లెత్తించి, మార్గంబులందు
కడకు చలిబాధ వగచు నక్కలకుగూడ
వస్త్రదాన మ్మొసంగిన పరమధర్మ
మూర్తి, లోకాంతరవ్యాప్తకీర్తిచంద్రి
కావిరాజితుడుత్తమకవులు భక్త
వరులు యోగులు మొదలగువారిచేత
ననవరతము పొగడ్తల నంది మున్ను
అమితకీర్తి గొన్నట్టి ధర్మాప్పరాయు
యశము విని మది నెంతయు నబ్బురపడి
అకట, అతడు నేడు లేడే, యని యార్తి గనెదు!
కాని, మదిని క్రీడాసక్తి కల్గెనేని
వాలుజడ వేసుకు గులాబివలువ గట్టి,
పొంకమౌవేణి చామంతిపూలు ముడిచి,
ముద్దుమోమున నిల్వుగా బొట్టు వెట్టి,
పుక్కిట విడెమ్ముతో, నుల్లిపొరలపైట
'సెంటు చేను కెకరమ్ము కంచె' యన జెల్లు
పెద్ద లంగా పయిం దాల్చి, వీథు లూడ్చు
చును విటుల నోరచూపుల జూరగొంచు
చక చకను వచ్చు నాదాసి జారుపైట
పారదోలి నడివీథిని పట్టపగలు,
నల్గు రెదుటను దానికి న్నవ్వుబాట్లు
కల్గజేసి కౌతుకమును గాంచి చనుమ!
రమ్యముల్‌ ఫలభారనమ్రమ్ములైన
ఆమ్ర నారంగ సీతాఫలాదివనము
లందగించు కాషాయజలాశయప్ర
వర్ధితము లౌచు పురికి నల్వంకలందు!
AndhraBharati AMdhra bhArati - kavitalu - basavarAju appArAvu gItAlu - 138. nUjavITi pOtugaDDa - basavarAju appArAvu geetaalu - Basavaraju Appa Rao - Basavaraju Apparao geeyamulu gEyAlu geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )