కవితలు బసవరాజు అప్పారావు గీతాలు 114. శారదాభంగము
114. శారదాభంగము
అమ్మరో! శారదా! యిటు లాతురమ్ము
తోడ బరువెత్తె దే కీడు మూడెనమ్మ?
నెమలివాహన మేమాయె, నెమ్మొగమ్ము
వాడి, కళదక్కి, శుష్కించి వ్రాలెనేమి?
విద్యలకు పుట్టినిల్లువై విమలకీర్తి
వెల్గుదేవివి నీ విట్లు వెఱ్ఱివోలె
నెమ్మొగమ్మెల్ల వెండ్రుకల్‌ గ్రమ్ముకొనగ
నటునిటులు పరువెత్తెద వక్కటకట!
కనుల కాటుక చెఱగెను, కళలదేఱు
నెమ్మొగమ్మెల్ల నల్లనై నింద్యమయ్యె!
వదనము లలాటశూన్యమై పాడువడియె
నింత యేహ్యపు రూపము నెపుడు గనమె!
దివ్యముగ వీణ మీటుచు తేజరిల్లు
మోమునందుండి త్రిభువన మోహనమగు
విమలగానము వెడలి లోకములనెల్ల
ప్రణయరసవార్ధి ముంపగ పరమసంత
సమున ఋషులెల్ల నాట్యముల్‌ సల్పుచుండ
పంచవన్నియల నెమలి పైన నెక్కి
మానస సరోవరంపు విమానవీథి
స్వైర సంచార మొనరింప కూర కిట్లు
పేదవడినట్టి మోముతో పెంపుదక్కి
వెఱ్ఱివలె పర్వులెత్తెద వేల నమ్మ!
ఎప్పటట్టులు వెల్లగా నిన్ను జూచి
కన్నులు గలందుకు ఫలంబు గాంచగలనె?
AndhraBharati AMdhra bhArati - kavitalu - basavarAju appArAvu gItAlu - 114. shAradAbhaMgamu - basavarAju appArAvu geetaalu - Basavaraju Appa Rao - Basavaraju Apparao geeyamulu gEyAlu geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )