కవితలు బసవరాజు అప్పారావు గీతాలు 126. తెలియనివలపు
126. తెలియనివలపు
        ఎంతటి చపలుండ నైతి
        నెంతటి మందమతినైతి
        సుంత జ్ఞానమున్న కలనె
        ఇంతి నీదుప్రేమ మఱువ?
గీ.     చేతులను నెత్తి ముద్దాడి చెలియ! నిన్ను
    చంక నెత్తుకు నాడించి సంబరపడి
    మూపు నుప్పుప్పుగోనెలు మోసి మురిసి
    కడ కిటుల గంగ గల్పితి జ్ఞానమెల్ల!
గీ.    'బాల! నీపతి యెవ' రన్న 'బావ' యనుచు
    ముద్దులొల్కెడి మోముపై ముసిముసి నగ
    వల్ల నల్లన మెఱయంగ నాత్మ వెలుగు
    ప్రణయముం దెల్పుదువుగాదె ప్రాణసఖియ!
గీ.    వెఱ్ఱిలోబడి, మతివోయి వెంగలినయి
    దైవికములగు ప్రేమబంధముల ద్రెంచు
    పాపకర్మము దలపెట్ట పడతి! నీవు
    మంచిపని గాదనుచు బుద్ధి మరువలేదె?
గీ.    ఎప్పుడింటికి వచ్చునా ఎపుడు కనుల
    కరువు దీరంగ గాంతునా కాంతు నంచు
    కలలసైతము నాకయి కలువరించు
    చెలియ నీవుండ నా సిరి చెప్పనౌనె?
        కన్నె! చపలత వోయె నింక ప్ర
        సన్నవై నన్నాదరింపవె!
        విన్నపముగొని మరువగదె నా
        చిన్నతనపు బనుల్‌.
        సత్య మరయంగల్గి తిప్పుడు
        సఖియరో నా భాగ్యవశమున
        కుదుటపడె నెమ్మనము, నావగు
        కోర్కు లీడేరున్‌.
        కష్టసుఖముల నొక్క తీరై
        కలుగుదానిం దృప్తి గడుచుచు
        చింత లేమియి లేక ముదమున
        జెలగుదము చిరము.
        బ్రతికియున్నన్నాళ్ళు నొండొరు
        బాయకుండగ ప్రేమసంద్రము
        నీదుదము చల్లనౌ చూపుల
        నీశ్వరుడు చూడన్‌.
AndhraBharati AMdhra bhArati - kavitalu - basavarAju appArAvu gItAlu - 126. teliyanivalapu - basavarAju appArAvu geetaalu - Basavaraju Appa Rao - Basavaraju Apparao geeyamulu gEyAlu geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )