కవితలు చీకటి నీడలు - బైరాగి 19. దిక్కులేనిపక్షులు
దిక్కులేనిపక్షులు

ఏ దిక్కులేని పక్షులమూ,
ఐశ్వర్యపు ప్రతికక్షులమూ,
బలిపశువుల ఆర్తధ్వని
ముంచేసిన వాద్యఘోష
మానిట్టూర్పుల మ్రింగిన
మీభీషణ హర్షహేష,
మానెత్తుట నింపినవే
మీ మధురాసన పాత్రలు
మాశవములపై నడచిన
మీదిగంతజయయాత్రలు
మా ఎముకల గూళ్ళపైన
కట్టిన మీసౌధాలూ,
మా జీవితజ్యోతి ఆర్పి
వెలిగిన మీదీపాలూ
మమ్ము వెక్కిరిస్తున్నయ్‌!
అవహేళన చేస్తున్నయ్‌!
జీవిత సాగర లహరులు
వెడగ్రక్కిన తృణాలము
సమ్రాట్టుల ద్యూతంలో
పనికొచ్చే ఫణాలము
కల్పనా ప్రేతభూముల
హాస్యాస్పద ఛాయలము
మృత్యులౌహ ముష్టిలోన
చిక్కిన అసహాయులము
ఆశారుణ ప్రత్యూషల
కాంతిమమ్ము చేరదెపుడు
మా నైరాశ్యపు చీకటి
మీ జ్యోతుల సోకదెపుడు
మా అనాధ జీవిత బాధలు
మీ అనంత వినోద గాధలు.
AndhraBharati AMdhra bhArati - kavitalu - dikkuleenipaxulu - chIkaTi nIDalu - AlUri bairAgi - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )