కవితలు చీకటి నీడలు - బైరాగి 14. కదిలించూ!
కదిలించూ!

కదిలించూ! నడిపించూ!
భగ్నాశల లోతుల్లో
పాతుకొన్న నీజీవిత
జడరథాన్ని కదిలించూ!
బ్రతుకుబాట నడిపించూ!
మేల్కొల్పు మహాయాత్ర సాగింది
అలలలోన ఆహ్వానం మ్రోగింది
పెనుగాడ్పులు వీస్తున్నయ్‌!
ధూళిపొరలు లేస్తున్నయ్‌!
సంఘర్షణ అణువణువున పలికింది
ఆకర్షణ ప్రతిజీవిని పిలిచింది
మత్తుకునుకు పనికిరాదు
బేలపలుకు పలుకరాదు
బ్రతుకుకడలి శాంతంగా ఉండరాదు
జడసమాధి మానవునికి అండకాదు
శబ్దకిరణ వేగంతో
నిత్యనవోద్వేగంతో
జీవితగతి సాగాలీ!
అమరప్రగతి కావాలీ!
అడ్డంకులు తొలగించూ!
సంకెళ్ళను వదలించూ!
బాధలపై మృత్యువుపై
విజయం సంపాదించూ!
AndhraBharati AMdhra bhArati - kavitalu - kadiliMchuu! - chIkaTi nIDalu - AlUri bairAgi - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )