కవితలు చీకటి నీడలు - బైరాగి 13. తిరిగిరండి!
తిరిగిరండి!

తిరిగిరండి! మరలిరండి!
నవజగతికి మరలిరండి!
భగ్నాశల మృత్యుసమాధిలో
చిరప్రశాంతి దుసహవ్యాధితో
వైచిత్ర్యం లేని బ్రతుకు
గడిపే భావుకులంతా
తిరిగిరండి! మరలిరండి!
ఈ మన బ్రతుకొక పోరాటం
సుఖదుఃఖపు అలల చెలగాటం
ఈ జీవిత జలధి ఈ
చావు బ్రతుకు తేల్చుకొండి!
తిరిగిరండి! మరలిరండి!
మీ క్షుద్రప్రేమ గాధలూ
మీ తుచ్ఛ విరహ బాధలూ
ఈ సంక్షుబ్ధ ప్రభంజన
రణధ్వనిలో ముంచేసీ
తిరిగిరండి! మరలిరండి!
నూతన సూర్యోదయ కాంతులు
సరిక్రొత్త ప్రపంచపు దూతలు
తలుపులు తట్టారదిగో!
స్వాగత మివ్వండి! లెండి!
తిరిగిరండి! మరలిరండి!
నవజగతికి తరలి రండి!
AndhraBharati AMdhra bhArati - kavitalu - tirigiraMDi! - chIkaTi nIDalu - AlUri bairAgi - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )