కవితలు చీకటి నీడలు - బైరాగి 11. విధ్వంసం
విధ్వంసం

ఏడ్చేవాళ్ళను పూడ్చేయండీ!
నవ్వే లతలను త్రవ్వేయండీ!
వాక్కుల్లో విషధారలు
దృక్కుల్లో రాక్షసికోరలు
చూపించే వాళ్ళేరండీ!
పిరికివాళ్ళను నరికేయండీ!
మెత్తటి మనసులు కొరికేయండీ!
ఎముకలపై ఎముకలు మ్రోగించండీ!
మృతశిశువుల హస్తాస్థులతో
ఊదండోయ్‌! పిల్లనగ్రోవులు
ఆర్పేయండా సూర్యచంద్రులను
చమురులేని దీపాలను
చీకటిలో ముంచేయండా
నీడల పాపాలను.
సుఖరోగ జీర్ణమైన ఆకాశపు ముఖంపైన
కప్పండొక నల్లని దుప్పటి,
నరభక్షక నిశాచర ప్రీతికి
అర్పించండొక దివాంధగీతిక
స్నేహపు సౌహార్ద్రంతో
మెత్తటి వెచ్చదనంతో
ఆడుకొన్న రోజులు గడిచాయి
మన ప్రకాశ గీతాలే మనలను
దారితెలీని చీకటిలో విడిచాయి
ఇప్పుడు నిరాశ జీవితనిశిలో
మండించండోయ్‌ ద్వేషపు మంటలు
పండించండోయ్‌! రక్తపు పంటలు
పాతేయండోయ్‌! గతాన్ని
తగలేస్తిరి ప్రస్తుతాన్ని
ప్రపంచపు మహా స్మశానంలో
చెయ్యండోయ్‌ శవసాధన
శక్తికి ఆరాధన
సహించకండోయ్‌! అత్యాచారం
గుచ్చండోయ్‌ పుర్రెలహారం!
చెయ్యండోయ్‌ నగ్నవిహారం!
వినాశ సుందరరూపం
వీక్షించిన వాడెవడూ
వికాసజడస్తూపం
రక్షింప బూనడెవడూ
జుగుప్స మన ఆదర్శం
ప్రేయసి మన విధ్వంసం.
AndhraBharati AMdhra bhArati - kavitalu - vidhvaMsaM - chIkaTi nIDalu - AlUri bairAgi - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )