కవితలు చీకటి నీడలు - బైరాగి 10. కిలకిల!
కిలకిల!

గాజుల గలగల
నవ్వుల కిలకిల
చక్కని చల్లని రాతిరినిండా
చల్లని మెల్లని రాతిరినిండా
వెన్నెల కన్నుల మంచుబొట్లతో
బరువౌ తెల్లని రాతిరినిండా
గాజుల గలగల
నవ్వుల కిలకిల
నీలాకాశపు పాలసజ్జపై
చుక్కలనే విరజిమ్మిన పూవులు
వినిపించని పువ్వుల సంగీతం
బ్రహ్మాండంలో మోగిననవ్వులు
పూచిన పువ్వుల గాజుల గలగల
నవ్వినపువ్వుల నవ్వుల కిలకిల
ఆ నవ్వుల సంద్రములో తరగల
తలపై వెలిగిన తెల్లని నురుగుల
చెదరిన ముక్కలు మెరిసే చుక్కలు
గలగల కిలకిల చుక్కల మిలమిల
ఒకే, ఒకే ధ్వని, అదే అదే ధ్వని
ప్రేలిందా ఒక తెలి నవ్వులగని
మారుమ్రోగినవి దేశ కాలములు
విశ్వవిశాల హృదంతరాళములు
మ్రోళ్ళైపోయిన దిక్కుల చెట్లవి
నూతన శాఖలతో చిగిర్చినవి!
సకలేంద్రియముల దేహప్రాణముల
నవద్వారముల అవే గానములు
పెనువరదలుగా పొంగిపోయినవి
గలగల కిలకిల మిలమిల తళతళ
పిచ్చి నవ్వులవి అడవి పువ్వులవి
ఆ నవ్వుల కమ్మని సువాసనలు
ప్రపంచమంతట ఆవరించినయ్‌
కిలకిల తళతళ లక్షలగొంతుల
లోకాన్నంతను పలుకరించినయ్‌
బ్రతుకుబాటలో నడిచేయాత్రల
చీకటిరేలను వెన్నెల కన్నెల
కలకల నవ్వులే కనికరించినవి
ఆ లోకపు ఆఘ్రాణం మోసే
అడవి పువ్వులే పలుకరించినవి.
అలసి సొలసి ఆవేదన చెందిన
కలగినలగి యమయాతనపొందిన
మా గుండెల మంటలలో
మా నెత్తురు పంటలలో
గణగణ మన్నవి దూరపుగంటలు
స్వప్నసముద్రపు తీరపుగంటలు
గంటల గణగణ నవ్వుల కిలకిల
గలగల కిలకిల చుక్కల మిలమిల
AndhraBharati AMdhra bhArati - kavitalu - kilakila! - chIkaTi nIDalu - AlUri bairAgi - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )