కవితలు చీకటి నీడలు - బైరాగి 03. యుగసంధి
యుగసంధి

సంధియుగం, సంధియుగం!
భూగర్భ ప్రజ్వలాగ్నుల
చలియించిన జగన్నగం
సంధియుగం! సంధియుగం!

జీవనమరణ సమస్యగ
నెత్తిపైన కూచున్నది
తప్పనిసరి సంఘర్షం
త్రోవకాచుకొని యున్నది
నూతనయుగ సంగీతం
మనస్సు ఊరిస్తున్నది
పురాణ జగవ్యామోహం
వదలక పీడిస్తున్నది
జీర్ణజగతి కంఠశోషలూ
నవ్యప్రగతి శంఖఘోషలూ
ఆవరించినయ్‌ మింటిని
కలచివేసినయ్‌ మింటిని
రాష్ట్రాల ఉష్ట్రయానం
దాచిననీళ్ళై పోయాయ్‌
'ఎడారి ఓడలు' దాహంలో
మునిగే టట్టున్నాయ్‌!
నిశా నభాంచలంలో
పొడిచిందో తోకచుక్క
సొమ్మేదో పోయినట్టు
మొరిగిందో పిచ్చికుక్క
పూర్వం కట్టిన గోడలు
బెత్తికలుగా ఊడాయి
వర్గాల పటాలాలే
పశువుల్లా కాట్లాడాయి
యుగాలు క్షణాలు, జగత్తొక
సంగర రంగస్థలిగా
కదలలేని కంకాళాలే
తరిగిపోని సైన్యావళిగా
కోసిన మనుషుల కుత్తుక
నెత్తురులే కాళ్ళకు లత్తుక
బీభత్స శృంగారంగా
మనుషుల కనులు రత్నహారంగా
నడచిందట! వచ్చిందట!
సంధియుగం! సంధియుగం!
అదిగో! అది జనసైన్యం
మహాయుద్ధంగ ఆకలి
వజ్రకవచమా దైన్యం
మును ముందుకు సాగుతోంది
అది దరిద్ర జనసైన్యం
మొగముపైన నవోదయపు
నవనవరక్త జ్యోతులు
కాళ్ళకింద నలిగిపోవు
క్రుళ్ళిన చీకటిలోతులు
వారివెనుక నిదురమత్తు
ముందునవ్య కార్యశక్తి
ఒకవైపున మంచుపొరలు
ఒకవైపున వెలుగు తెరలు
చీకటివెలుగుల కలయిక
ఏడ్పులనవ్వుల కలయిక
జీవితరంగస్థలిపై సృష్టిప్రళయముల కలయిక
ఎర్రని తెల్లని కాంతులు
ఆకాశపు కనుగొనలను
అన్నిచోట్ల దశదిశలను
నెత్తుటివెలుగుల వాంతులు
మండుతోంది భగభగభగ
రేజీకటి పెనుకాష్ఠం
మెరుస్తోంది ధగధగధగ
మంటల రక్త కిరీటం
అది రాలిన పండుటాకు
ఇది మెత్తని చిగురుటాకు
చెలరేగే మంటలవమ్మది
తులదూగే పువ్వులసొమ్మిది
అవి గిలగిల తన్నుకొనే
ప్రాతయుగపు ఘోర మరణయాతనలూ
ఇవి తళతళ ఉదయించే
నూత్నజగతి వీరప్రసవవేదనలూ
అది నెత్తుట మునిగిన ఓటమి
ఇవి నెత్తుట తేలినగెలుపులు
అవి గడిచినకాలపు ఏడ్పులు
ఇవి దూరపు తూరుపు పిలుపులు
ఇరువంకల సకలదిశల
కనుగొలకుల అరుణకాంతి
అరుణకాంతిలో పొగలా
రాజుతోన్న చిర అశాంతి
తిరుగుబాటు జెండాలా
ఆకాశం నెత్తురుతో రంగరించి అరుదెంచిన
సంధియుగం! సంధియుగం!
AndhraBharati AMdhra bhArati - kavitalu - yugasaMdhi - chIkaTi nIDalu - AlUri bairAgi - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )