కవితలు చీకటి నీడలు - బైరాగి 04. పెను తుపాను
పెను తుపాను

ఈతుపాను పెనుతుపాను
చిరజర్జర జగద్వృక్ష
మూలాన్నే కదలించే
విదిలించే, పెకళించే
ధ్వంస దేవతాశ్వంలా
పరుగెత్తే, సకిలించే
ఈ తుపాను, పెను తుపాను.

ఆకాశపు సముద్రంలో
మబ్బుల కెరటాలజోరు
భూమిచుట్టు చెలరేగిన
ప్రళయ మహోదధులహోరు
చిరప్రశాంత, చిరప్రసుప్త
జీవిత సాగరంలోన
రేగిందొక పెనుతుపాను
జలజల ఆకులురాలీ
ఫెళఫెళ తరువులుకూలీ
తెలతెలబోయే మానవ
నిర్మిత సౌందర్యజగతి
వెలవెలబోయే వణకే
సృష్టికి ఇక యేమిటిగతి?
చూపుల పొలిమేరదాటి
వ్యాపించిన చీకటిలో
వెలుగుదారి కననేరని
జగశ్మశాన వాటికలో
పగబట్టిన తాచుబాము
రగిలిన క్రోధాగ్ని సెగలు
ఈ తుపాను పెనుగాడ్పులు
శతాబ్దాల సమాధిలో
నిదురించే మృతజీవిత
శవముకూడ వణుకుతోంది
ఈ తుపాను మహోద్ధతికి!
యుగయుగాల తరతరాల
బంధనాల నూడ్చివేసి
ఆకాశపు టెడారిలో
జన సంస్కృతి శిథిలాల్లో
నగ్నోచ్ఛృంఖల స్వేచ్ఛా
వీరవిహారం చేసే
ఈతుపాను! పెనుతుపాను!
వాన! వాన! ఒకేవాన!
గాలి! గాలి! ఒకేగాలి!
చిటపట చినుకులు కావవి!
మలయుని పులకలు కావవి!
రావణదాస్యం చేసిన
పంచభూత సంఘశక్తి
మేల్కొన్నది, మేల్కొన్నది
కోల్కొన్నది! కోల్కొన్నది!
ఉరుముల కంఠధ్వనితో
మెరుపుల వీక్షణములతో
పాము బుసలశ్వాసలతో
మేల్కొన్నది! కోల్కొన్నది!
పంచభూత సంఘశక్తి
ఎక్కడ? ఆశ్రయ మెక్కడ?
దిక్కులేని పక్షులకూ
ఇళ్ళులేని మనుజులకూ
సర్వజీవ జంతువులకు
ఎక్కడ? ఆశ్రయ మెక్కడ?
జలమయ మగు జగతిలోన!
యుగయుగాల తరతరాల
పేదజనుల స్వేదధార
మానధనుల అశృధార
ఆకాశపు కళ్ళలోంచి
కట్టలు తెగి పొరలుతోంది.
గౌతమబుద్ధుని హృదయం
కరుణాంబుధి సముచ్ఛయం
ఉప్పెనగా కప్పుతోంది
పాపకళంకిత పృధ్విని.
ఆగబోదు ఈ తుపాను
ఆగరాదు ఈ తుపాను
ఆగబోదు ఈ తుపాను
మీ మేడలు మునుగువరకు
మీ కోటలు కూలువరకు
మీ అంతఃపురకాంతలు
భూమిపైన దొరలువరకు
శోకంతో పొరలువరకు
ఆగరాదు ఈ తుపాను
మీ జీవిత నరమేధపు
యజ్ఞాగ్నులు ఆరువరకు
మీ వైభవ శిథిలాల్లో
పెనువరదలు పారువరకు
పాపతాపతస్త పృథ్వి
శోకము చల్లారువరకు
ఆగరాదు ఆగబోదు
ఈ తుపాను పెనుతుపాను.
ఏడవండి! సుకుమారులు
ధనవంతులు, బలవంతులు
అదృష్టపు ప్రియపుత్రులు
ఏడవండి! ఏడవండి!
మీ చేసిన దురంతాల
దురితాగ్నుల పెనుమంటలు
మీ కార్చిన కన్నీరుల
కుంభవృష్టి ఆర్పువరకు
ఏడవండి! ఏడవండి!
మానవసంఘం పెంచిన
పాపపంక ప్రక్షాళన
జరిగే సుదినము నేడే!
ఏడవండి! ఏడవండి!

* * *
ఎవరువారు! ఎవరువారు!
ఈ తుపాను హోరులోన
చావుబ్రతుకు పోరులోన
వెనుదిరగక మునుముందుకు
దీక్షతోడ సాగువారు!
ఈ భీషణ ధ్వంసలీల
లో నూతన వసంతాల
అంకురాలు చూచువారు!
ప్రేమతోడ కాచువారు!
మానవశవ మాలలతో
నిండిన సంస్కృతి పథాన
నడకలోన పెనుతుపాను
హృదయంలో పెనుతుపాను
జీవితమే పెనుతుపాను
గా సాగెడువారు ఎవరు!
ఎవరువారు! ఎవరువారు!
ఆకాశపు గుండెచీల్చి
భూ సీమల కడుపుకాల్చి
హిమగిరి శిఖరాగ్రంపై
ప్రశాంతాబ్ధి గర్భంలో
బడబానల జఠరానల
హాలాహల రూపమెత్తి
దౌర్భాగ్యపు దారిద్ర్యపు
యుగయుగాల తిరుగుబాటు
పైకెత్తిన జయపతాక
ఎగురవేయువారు ఎవరు?
ఎవరువారు! ఎవరువారు!
జనసంఘం సిగ్గుతోడ
పారేసిన వెలివేసిన
తల్లిలేని తండ్రిలేని
అనాధశిశువులు వారే!
భవిష్య యుగగర్భంలో
నూతన జీవితజ్యోతుల
ఉదయముకై వేచియున్న
చీకటి శక్తులు వారే!
అలజడియను అశాంతియను
ఉగ్గుబాలతో పెరిగిన
తుపాను బిడ్డలు వారే!
వారే తుపానుబిడ్డలు!
సాగిరండు! సాగిరండు!
తుపాను బిడ్డల్లారా!
అనాధ శిశువుల్లారా!
చీకటి శక్తుల్లారా!
సాగిరండు! సాగిరండు!
ఈ తుపాను నీడల్లో
జలప్లవపు జాడల్లో
అడుగిడుతూ, పరుగిడుతూ
సాగిరండు! సాగిరండు!
మీ నూతన సౌధానికి
మీ ఆశ్రయ స్థానానికి
శాంతిలోన, చావులోన
నవజీవిత విజయానికి!
నేడు కాదు, 'రేపు' మీది!
'రేపు' నాది యనుమంత్రపు
శక్తితోడ సాగిరండు!
రేపీ తుపాను ఉండదు
ఈ వరదలు దిగిపోతయ్‌!
రేపు బయలుదేరునావ
చుక్కాణీ మనదేనోయ్‌!
రేపుదయించెడు సూర్యుడు
మీకొరకై తరుణారుణ
మధుకాంతుల జయమాలలు
సిద్ధంగా ఉంచుతాడు.
రేపే మీ కళ్యాణం!
తుపాను బిడ్డల్లారా!
AndhraBharati AMdhra bhArati - kavitalu - penu tupaanu - chIkaTi nIDalu - AlUri bairAgi - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )