| కవితలు | దాశరథి కవితలు | అగ్నిధార |
| 47. అనల దాహము | |
|
ఎటుచూచిన చటులానల పటుదాహం ప్రబలుతోంది. | |
|
మన భారత జనయిత్రీ ఘనఫాలం జనసామాన్య నవోజ్వల చైతన్య జ్యోతులతో వెలుగుతోంది వెలుగుతోంది. | |
|
భూత కాల భేతాళుడు పాతాళపు పర్రలలో ఇరుక్కొని మరణించెను; | |
|
వర్తమాన మార్తాండుని కృధానిదాఘంలో సామ్రాజ్యపు సాంద్ర హిమం రాలి, గాలిలో కలిసెను. | |
|
నవభారత యువకులారా! కవులారా! కథకులారా! భవితవ్యపు హవనానికి హోతలు; నూతన భూతల నిర్మాతలు మీరే, మీరే. | |
|
స్వకుక్షింభర రక్షస్తతి పక్షాలను విరగ్గొట్టి సమిధలుగా తే తెండోయ్, సమతా జమదగ్ని కుమారులార! శ్రమజీవుల సమభావుల అమృతసిద్ధి సుముహూర్తాగమనానికి అమిత దుఃఖ సముద్రాలు మధించండి; ఎటు చూచిన చటులానల పటుదాహం ప్రబలుతోంది. | |