| కవితలు | దాశరథి కవితలు | అగ్నిధార |
| 48. నడిగడ్డ | |
|
చుట్టూ సముద్రం పొంగి నట్ట నడిగడ్డను మ్రింగి అంతా ఏకం చేస్తుం దంతా ఒక టౌతుంది. | |
|
నడిగడ్డను సముద్రాన పడకుండా కాపాడే బడాయి నీ కెందుకు? రాజా? లడాయి నీ కెందుకు? | |
|
గుట్టల్ని, పుట్టల్ని మింగుతూ చుట్టూ సముద్రం పొంగింది నట్ట నడిగడ్డను కాపాడే దిట్టదనం నీలో లేదోయి. | |
|
నాలుకలు చాస్తూ సంద్రం నేలను నాకేస్తున్నది; కూలిపోతుంది హిమాచలం రాలిపోతుంది సూర్యగోళం. | |
|
నీ తుపాకి నిప్పులతో చేతులు కాల్చేసుకోకు నీళ్ళమీద నిప్పులు పడి చల్లబడకపోతాయా? | |
|
నడిగడ్డ కడుపులోని నదులుకూడ అటువైపే సముద్రాన్ని రమ్మంటూ సైగలు చేస్తున్నవిరా! | |
|
అంతర్భహిశ్చ తత్సర్వం శత్రువులే నిండినారు ఇంకేమి బింకంరా! ఓ లంకాద్వీపపు రాజా! | |
|
మువ్వన్నెల రత్నరాశి రువ్వుతూ అదె వచ్చె నదే ఉవ్వెత్తున అంభోనిధి! కెవ్వుమనెను రాజుగుండె. | |