| కవితలు | దాశరథి కవితలు | అగ్నిధార |
| 49. పదే పదే అనేస్తా | |
|
ఇదే మాట ఇదే మాట పదే పదే అనేస్తాను. | |
|
ఖదం తొక్కి పదం పాడి ఇదేమాట అనేస్తాను. | |
|
ఎదల్లోన, రొదల్లోన సొదల్లోన, గదుల్లోన ఇదే మాట ఇదేమాట పదే పదే అనేస్తాను. | |
|
జగత్తంత రగుల్కొన్న కృథాజ్వాల వృథాపోదు. | |
|
అడుగడుగున యెడదనెత్రు గడగడ మని త్రాగినావు. | |
|
పడతుల మానాలు దోచి గుడగుడ మని 'హుక్క' త్రాగి జడియక కూర్చుండినావు మడికట్టుక నిలిచినావు. | |
|
దగాకోరు బటాచోరు రజాకారు పోషకుడవు. పూళ్ళ కూళ్ళు అగ్గిపెట్టి ఇళ్ళన్నీ కొల్లగొట్టి తల్లి పిల్ల కడుపుగొట్టి నిక్కిన దుర్మార్గమంత నీ బాధ్యత నీ బాధ్యత. | |
|
'కోటిన్నర' నోటివెంట పాటలుగా మాటలుగా దిగిపొమ్మని దిగిపొమ్మని ఇదేమాట అనేస్తాను. | |
|
వద్దంటే గద్దె యెక్కు పెద్దరికం చేస్తావా! మూడుకోట్ల చేతులు నీ మేడను పడతోస్తాయి మెడనే విడతీస్తాయి. నీకు నిలుచు హక్కు లేదు నీ కింకా దిక్కు లేదు. | |
|
చరిత్ర బొంగరం తిరిగి కిరీటాలు నేల కొరిగి ధరాధిపులు నశిస్తుంటే బరాయెనాం నవాబా! పరాక్రమం చూపేవా? | |
|
'దిగి పొ'మ్మని జగత్తంత నగారాలు కొడుతున్నది. "దిగిపోవోయ్ తెగిపోవోయ్ తెగిపోవోయ్ దిగిపోవోయ్" ఇదే మాట ఇదే మాట పదే పదే అనేస్తాను. | |