| కవితలు | దాశరథి కవితలు | అగ్నిధార |
| 45. ? | |
|
ఆ చల్లని సముద్రగర్భం దాచిన బడబానలమెంతో? ఆ నల్లని ఆకాశంలో కానరాని భానువు లెందరో? | |
|
భూగోళం పుట్టుకకోసం కూలిన సురగోళా లెన్నో? ఈ మానవరూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. | |
|
ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠా లెన్నో? శ్రమజీవుల పచ్చి నెత్తురులు త్రాగని ధనవంతు లెందరో? | |
|
అన్నార్తులు అనాధ లుండని ఆ నవయుగ మదెంత దూరమో? కరువంటూ కాటక మంటూ కనుపించని కాలాలెప్పుడో? | |
|
అణగారిన అగ్ని పర్వతం కని పెంచిన "లావా" యెంతో? ఆకలితో చచ్చే పేదల శోకంలో కోపం యెంతో? | |
|
పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం యెంతో? గాయపడిన కవిగుండెల్లో వ్రాయబడని కావ్యాలెన్నో? | |
|
కులమతముల సుడిగుండాలకు బలిగాని పవిత్రు లెందరో? భరతావని బలపరాక్రమం చెర వీడే దిం కెన్నాళ్లకో? | |