| కవితలు | దాశరథి కవితలు | అగ్నిధార |
| 44. దీపావళి | |
|
భూపావళి బుగ్గి చేసి కోపావళి నగ్గిద్రోసి దీపావళి జరపండో దేశ దేశ జనులారా! తెలంగాణ ఘనులారా!! | |
|
వ్యక్తులు పరిపాలించే శక్తి నశించింది నేడు రక్తంలో అణు వణువూ శక్తి గడించింది నేడు. | |
|
చీకటి దయ్యం వొకటే లోకానికి రాజైతే ఆకాశం నిలువబోదు! అర్థరాత్రి విలువలేదు!! | |
|
కోటి కోటి దీపాలను బాటలలో కోటలలో నాటండి ప్రజలారా! వేటాడండి తమస్సును | |
|
కాలపు కళ్ళెమును లాగి కదం వెనక్కు తొక్కించే ఘను లంతా నడుం విరిగి కదల్లేక నశించారు. | |
|
మనం వెనక్కి నడవం! జనం వెనక్కి నడవదు మనం జనం, జనం మనం జనం లేనిది మనం లేము. | |
|
చల్లని చము రుంటేనే జ్వాలావళి, కీలావళి; ప్రజాబలం వుంటేనే ప్రభుత్వాలు, రాజ్యాలూ. | |
|
లోకానికి మూల మూల ఆకలితో కేక వేయు నిరుపేదా! జరుపుకోర మరో దివ్య దీపావళి. | |