కవితలు దాశరథి కవితలు అగ్నిధార

మలి ముద్రణ: తొలిపలుకు - శ్రీ దేవులపల్లి రామానుజరావు

"దాశరథికి ఉజ్జ్వలమగు సారస్వత భవిష్యత్తు గలదు-" పన్నెండు సంవత్సరాల క్రిందట శ్రీ దాశరథి తన ప్రథమ ఖండకావ్యసంపుటి; 'అగ్నిధార'ను ప్రవహింప జేసినపుడు పీఠికలో చెప్పిన జోస్యము. ఈనాడు ఆ జోస్యము ఫలించినది. తెలుగు ప్రజలు నరనరాలకు ప్రాకిపోయిన 'అగ్నిధార'కు ఈనాడు పీఠిక అక్కరలేదు; పరిచయవాక్యాల ప్రసక్తి రానేరాదు. అయినా, కవిగారి పట్టుదల కారణమున, నాలుగు మాటలు చెప్పవలసి వచ్చుచున్నది.

ఈ చిరుకబ్బము 'గాయపడిన కవి గుండెలలో వ్రాయబడిన కావ్యము'. కవి గుండెలలో వ్రాయబడిన ఈ కావ్యములోని ప్రతిమాట సూటిగా శరమువలె మన హృదయాలను హత్తుకొంటుంది. దాశరథి కవితా శరములు చాల వాడియైనవి. కాని ఈకవితాశరములన్నీ అగ్నిబాణాలని అనుకోవడము న్యాయముకాదు; వీనిలో అనేకము మదిలో మధురభావనలను పులకెత్తించెడి కుసుమశరాలు.

దాశరథి లేఖిని జ్వాలాముఖి మాత్రమే కాదు; అగ్నిధారలతోనే దాశరథి కవితావిర్భావము జరుగలేదు. దాశరథి రసికుడు గూడ; ప్రబంధ సంప్రదాయాలను కవిగారి కలము పరిపూర్ణముగా ఆకళించుకొన్నది. అందుచేతనే ఒకచోట ...

    "పది కావ్యమ్ములపాటు ప్రేమమయ ది
        వ్య స్వాంతగీతాలు వ్రా
    సెద; కాంతాధర కంపిత ప్రవచన
        శ్రీలే ఉటంకించెదన్‌;"

అని వ్రాసినాడు. అంతే కాదు;

    "... నా కలంపు వి
    న్నాణముతో రచింతు లల
    నా! నును చెక్కులపైని కావ్యముల్‌."

అని గూడ అన్నాడు.

'కవితా ,మదిరానుపానమే అతులిత మోహనౌషధ' మని శ్రీదాశరథి ప్రకటించిన ఒక అభిప్రాయము. ఇంతి, వాసంతి దాశరథికి అతిప్రియమైన కవితావస్తువులు. ఉషస్సులో, చంద్రోదయములో, శరత్తులో, శిశిరములలో అన్నింటా ఆయనకు అతివలే కన్నులకు కట్టుతారు. లేకపోతే -

    "ఆకులు రాలిపోయె, దెస
        లన్నిట చీరెలు జారిపోయె; న
    గ్నీకృతయై మహా ప్రకృతి
        నేలకు మోమును వాల్చె; ..."

వంటి మనోహరమైన వర్ణచిత్రాలను శబ్దీకరించలేక పోయెడివాడు.

    "ఇట వసంతము లేదు, సహింపరాని
    గ్రీష్మ హేమంత కాల కాళికలెగాని;
    ఇట ఉషస్సులు లేవు; భరింపరాని
    అంబువాహ సందోహ నిశాళి కాని.

    వెన్నెలలు లేవు, పున్నమకన్నె లేదు,
    పైడి వన్నెల నెలవంక జాడ లేదు,
    చుక్కలే లేవు, ఆకాశ శోకవీధి
    ధూమధామమ్ము, దుఃఖ సంగ్రామభూమి."

అని ఉస్సురుమనక పోయెడివాడు.

కాని దాశరథి రసికతకు కాలము కట్టలు కట్టినది; ఊరు గాలుచుండగా వీణ వాయించుట దాశరథి ప్రకృతి కాదు. అగ్నిగుండముగా మారిన తెలంగాణము దాశరథి అభ్యుదయభావాల ఆవేశానికి కారణమైనది. 'జనం మనం, మనం జనం' అని దాశరథి తన కవితాశరాలను సంధించినాడు. దాశరథి నిజమైన ప్రజాకవి; ప్రేక్షకునివలెగాక ప్రజల కష్టనిష్ఠురాలలో తానొకడుగా కలసిపోయినాడు. అందుచేతనే దాశరథి 'అగ్నిధార'లో అణుమాత్రమైనా కాల్పనికత గాని, అవాస్తవికతగాని కనిపించదు. తెలంగాణ ప్రజల స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రతిబింబము దాశరథి కవిత్వము; ఆయనది అచ్చమైన అభ్యుదయ కవిత్వము.

ఒకవైపున ప్రజల ప్రాణాలు, మానాలు అగ్నికి ఆహుతి యగుచుండగా మరొకవైపున తాను కవితామదిరాపానమత్తుడై సొక్కిపోలేదు.

    "... మధుర
    మంజుల మామక లేఖినీ ముఖం
    బెండకు మండిపోయి రచి
    యించును గ్రీష్మ మహా ప్రబంధముల్‌"

అని అగ్నిధారలను విరజిమ్మినాడు.

    "ఎముకల్‌ నుసిజేసి పొలాలు దున్ని, భో
    షాణములన్‌ నవాబుకు
    స్వార్ణము నింపిన రైతుదే, తెలం
    గాణము రైతుదే"

అని యెలుగెత్తి చాటినా, మనసులో యేదో ఒకమూల కొంత నిర్వేదము లేకపోలేదు.

    "తీగెలను తెంచి అగ్నిలో దింపినావు
    నా తెలంగాణ, కోటిరత్నాల వీణ"

అని యెంతో ఆవేదనతో అన్న మాటలు.

దాశరథి హృదయమునుండి పొగలు, సెగలు పైకి ఉబికి వచ్చి 'అగ్నిధార'లో అక్షరరూపమును దాల్చినవి. ఆగర్భ శ్రీనాథునికి., అనాథునికి మధ్య చిరకాలమునుండి జరుగుచున్న సంఘర్షణను ప్రధానముగా ఇంతితో, వాసంతితోపాటు మా దాశరథి తన కవితా వస్తువుగ స్వీకరించినాడు. తెలుగు సాహిత్యములో ఇదియొక విప్లవాత్మకమగు మార్పు. ఈ మార్పునకు మన ఆర్థిక, సాంఘిక పరిస్థితులే కారణమని చెప్పవచ్చును. నేడు మనదేశములో ఆర్థికముగా ఒక గొప్ప విప్లవము జరుగుచున్నది. సాహిత్యములో గూడ యిట్టి తిరుగుబాటే కనపడుచున్నది. ఈ తిరుగుబాటుకు దాశరథి 'అగ్నిధార' ప్రాతినిధ్యము వహించుచున్నది.

నిలువ నీడలేని, నిస్వార్థమానవుని అభ్యుదయమే దాశరథి కవిత్వమునకు ప్రేరణ. "సజ్జబువ్వ కోసరమై లజ్జవిడిచి చిరిగిన చీరలతో, ముజ్జగాలు తిరిగే పేదల యెంగిలి మెతుకులు దొంగిలించి బంగారం పొంగించిన ధనికుల మ్రింగాలని దొంగచాటుగా కాలం తొంగిచూచిన"దని దాశరథి హెచ్చరిక. 'నీ పిల్లలను, ఇల్లాలిని కిల్లీ మాదిరిగా నమిలే మిల్లు మ్యాగ్నేట్లు, నీ వేడినెత్తురుతో షవర్‌బాత్‌ తీసుకొనే భువనైక ప్రభువుల, ఆధిక్యత'ను ఉంచగూడదని 'అగ్నిధార'లో దాశరథి కార్మికులను ప్రబోధించినాడు. 'అగ్నిధార' నరాలకు అగ్గిని పెట్టి, మెదడుకు ఉడుకు నెక్కించుచున్న విద్యుత్‌ కావ్యము; గ్రీష్మ మహాప్రబంధము.

ఆనాడు తెలంగాణ మంతయును కుంపటిలోపడి నిప్పులతో నిండిపోయినదని చెప్పినచో అత్యుక్తి కాజాలదు. ఆనాటి ప్రజల కష్టాలు దాశరథిని కాలరుద్రునిగా చేసినవి. "వ్రణాలకు, రణాలకు, మరణాలకు, మాన ప్రాణ హరణాలకు హద్దూ పద్దూ వుండని కరకు తురకరాజ్యములో చిరఖేదం విరమించుక బ్రతికేమా; కడుపునిండ గంజినీళ్ళు గతికేమా!" అని దాశరథి దీర్ఘ నిశ్వాసము విడిచినాడు.

    "ఏనాడో తెలుసునాకు
    ఈ నిరీహ
    నీరవ
    నిస్స్వార్థ
    నిర్ధన
    నీచనీచ మానవునికి
    నిలువ నీడలేదు జగతి.
    లేదులేదు విలువలేదు
    రక్తానికి, ప్రాణానికి
    శ్రమకూ, సౌజన్యానికి ..."

అని హృదయవిదారకమైన నిరాశను గూడ వెల్లడించినాడు.

    "కర్షకులు, కార్మికులు
    మథనపడే మేధావులు
    తమ శ్రమలకు తగిన ఫలం"

ఇమ్మంటే 'తిరుగుబాటు!'గా పరిగణిస్తారని నిస్పృహను ప్రకటించినాడు. అయితే దాశరథి నిరాశావాది కాడు; విధి తనతో సహకరించక విపరీతముగా ప్రవర్తించినపుడు సైతము I adore life; I abhor death అని అనగలిగిన ఆశావాది దాశరథి. అందుచేతనే ...

    "తరతరాల దరిద్రాల
    బరువులతో కరువులతో
    క్రుంగి క్రుంగి కుమిలి కుమిలి
    తలవాల్చిన దీన పరా
    ధీనజాతి శ్రమికజాతి
    దెబ్బతిన్న బెబ్బులివలె
    మేల్కొన్నది మేల్కొన్నద"ని

పీడితప్రజల వాణికి తన కవితను 'మైక్‌'గా అమర్చి దిక్కులను పిక్కటిల్లజేసినాడు.

    "నీళ్ళలో నిప్పుమాదిరి, నిప్పులోన
    నీళ్ళమాదిరి, కష్టాల నీడలందు
    సుఖము నివసించునంట! ఉస్సు రను వేడి
    ఊర్పులోన పరీమళా లున్నవంట!"

ఇంత సుందరముగ, సురభిళముగ ఒక సత్యాన్ని చాటి చెప్పడము దాశరథి ప్రత్యేకత. మరుసటి క్షణములో యేమి ముంచుకరానున్నదో యేమిటో అను భయాందోళనలు ప్రబలియున్న సమయమున దాశరథి భవిష్యత్తు ఆశావహమైనదని,

    "నవభారత యువకులారా!
    కవులారా! కథకులారా!
    భవితవ్యపు హవనానికి
    హోతలు; నూతన
    భూతల నిర్మాతలు
    మీరే, మీరే"

నని, విజయగీతిక వినిపించినాడు.

తెలంగాణలో జరిగిన ఆస్తుల దోపిడులు, పడతుల మానాల అపహరణము, ఊళ్ళకు ఊళ్ళు అగ్గిపెట్టి, తల్లి పిల్లల కడుపు కొట్టిన దుర్మార్గము మున్నగు సంఘటనలు దాశరథి హృదయములో నిప్పుకణికలను వెదజల్లినవి. తత్ఫలితముగా చెలరేగిన జ్వాలలు తెలంగాణ సమర సాహిత్యముగా పరిణమించినది. జగత్తంతా రగుల్కొన్న క్రోధజ్వాల ఊరకపోదని, ఆ దుర్మార్గులకు కారకులైనవారిని దాశరథి కవివాణి శపించినది. దౌర్జన్యము, అన్యాయము, అక్రమములమీద తిరుగుబాటే ఒక్కమాటలో అగ్నిధారలోని కవిత్వము. పీడితప్రజల సమస్యలకు అతి శక్తివంతమైన కావ్యరూపము నిచ్చిన కవి దాశరథి; తెలంగాణ సమాజపు చారిత్రక పరిణామములో ప్రగతిశీలమైన పాత్రను నిర్వహించి దాశరథి చరితార్థమైన 'అగ్నిధార'ను వెలువరించినాడు. 'అగ్నిధార' సజీవమై, శాశ్వతమై భాసించగలదు.

కవికి ఉండవలసిన ఆత్మవిశ్వాసమునకు దాశరథిలో కరువు లేదు. తన కవితను గూర్చి, కావ్యాలను గూర్చి ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలు అతిశయోక్తులుకావు; ఆత్మవిశ్వాసానికి అవి నిదర్శనాలు.

    "... ... ... ... ... ని
        శీధములం దభిసారికా పదా
    బ్జాయత రాగరంజితన
        వారుణ కంటకపాళి గూర్చి నే
    గేయము వ్రాసినట్లు; విలి
        ఖింతువు లోతగు భావముల్‌ శిలన్‌"

ఉలితో పాషాణములో పీయూషాన్ని చిప్పిలజేసే శిల్పికి, కవికి చాల చక్కని సామ్యము.

మరొకచోట

    "నాదొక వెఱ్ఱి; త్రాగుడున
        నాడును వీడును అమ్ముకొన్న ఉ
    న్మాదివలెన్‌ కవిత్వమున
        నా సకలమ్మును కోలుపోయి రా
    త్రీ దినముల్‌ రచించితిని
        తీయని కావ్య రస ప్రపంచముల్‌;"

అని కమనీయముగ చెప్పినాడు దాశరథి.

కాలపు కరకు రాపిడికి తట్టుకొని వన్నెలు దీరినది 'అగ్నిధార' కావ్యము. కాలము దాశరథి అతులిత కవితాప్రతిభకు అంజలి ఘటించినది. కవికి యింతకంటెను ఉన్నతమైన సన్మానము మరొకటి ఉండదు.

'అగ్నిధార'తో ఆరంభమైన దాశరథి కవితాధుని అమృతధారగా దేశములో నిరంతరముగా ప్రవహించవలెనని నా ఆకాంక్ష.

దేవులపల్లి రామానుజరావు.

హైదరాబాదు
24-11-62

AndhraBharati AMdhra bhArati - dAsharathi - agnidhAra - dASarathi - dASarathi kRiShNamAchArya - Dasaradhi Krishnamacharya ( telugu andhra )