కవితలు దాశరథి కవితలు అగ్నిధార
ఆళ్వారుకు
 
అసలు ఆళ్వార్లు పన్నెండుమందే;
పదమూడో ఆళ్వార్‌ మా
వట్టికోట ఆళ్వార్‌స్వామి!
నిర్మలహృదయానికి
నిజంగా అతడు ఆళ్వార్‌;
దేవునిపై భక్తిలేకున్నా
జీవులపై భక్తి ఉన్నవాడు;
తాను తినకుండా
ఇతరులకు అన్నం పెట్టగలవాడు.
జైలుగోడలమధ్య
కేళీవిలాసంగా ఉండగలవాడు.
శరీరంలో ప్రతి అణువూ
అరోగ్యస్నానం చేసే రీతిని
నిష్కల్మషంగా నవ్వగలవాడు.
అతని కలం వజ్రాయుధం,
అతనిది న్యాయపథం;
అతన్ని మృత్యువు ప్రేమించింది
మృత్యువువంటి రాకాసి శూర్పణఖకు
అతడంటే ఇష్టం కలిగింది.
రాముడి తెలివితేటలులేని
అమాయకుడు ఆళ్వార్‌!
మృత్యువుకు బలియైపోయాడు,
మమ్మల్నివదిలేసిపోయాడు.
అయినా ఎంతదూరం పోతాడతడు?
మన హృదయాల మల్లెపందిళ్లకింద
దోహదక్రియ జరుపుతుంటాడు.
నీడలా వీడక మనవెంట వుండి
వేడివేడి అలోచనల పాయసం అందిస్తాడు.
ఎక్కడ దుఃఖం వున్నా, బుద్ధుడిలా
ఏగి, తోచిన సాయం చేస్తాడు.
అతడు ప్రజల మనిషి;
అతడంటే దుష్టులకు కసి
అబద్ధాసురుని పాలిటి తల్వార్‌ ఆళ్వార్‌;
ఆనందరమణికి షల్వార్‌ ఆళ్వార్‌.
అతను పోయినప్పటినుంచీ
అమృతహృదయం విచ్చి
నవ్వగలవాడు లేకుండా పోయాడు లోకంలో
ఆళ్వార్‌ లేని లోకంలో
అంధకారం ఆధిపత్యం చలాయిస్తుంది.
అతడంటే చీకట్లకు భయం,
వెలుతురులకు జయం.
స్వార్థం రాచరికం నెరపే లోకంలో
నిస్స్వార్థి అతడొక్కడంటే
అతిశయోక్తి అలంకారం అడ్డురాదు.
ఆశ్రయింపు లెరుగనివాడు
విశ్రాంతి తెలియనివాడు
స్వసుఖం కోరనివాడు
వారంవారం మారనివాడు
రంగులద్దుకోలేనివాడు
మనిషి మనస్సులో మంచినేగాని
చెడు అనే మాలిన్యాన్ని వెతక తలపెట్టనివాడు.
మిత్రునికోసం కంఠం ఇవ్వగలవాడు
మంచికి పర్యాయపదం ఆళ్వార్‌.
అతనిదే సార్థకమైన జీవితం
అతనికి అగ్నిధార అంకితం.
AndhraBharati AMdhra bhArati - dAsharathi - agnidhAra - AlvAruku - dASarathi kRiShNamAchArya - Dasaradhi Krishnamacharya ( telugu andhra )