కవితలు దాశరథి కవితలు రుద్రవీణ
14. కవాటం
 
గతాన్ని
విస్కీగా తాగిన
కవిన్నేను!
భవిష్యత్తు నిషా నిజం.
శ్రమ జీవుల స్వేదం -
పొంగిన లవణ సముద్ర తరంగం,
లవణ సముద్రం పెంచిన
భవితవ్యం - అమృతకిరణ
చంద్రబింబ పౌర్ణమాసి.
ప్రాగ్దిశా నివాసులార!
పేదలార!
మీరేనా? చీకటింటి
తలుపుతోసి
పిలుస్తోంది మీరేనా?
రక్త కవాటం కిర కిర!
ఎగిరిన చిన్ని చిన్ని పర్వతాలు
రాబందులు!
రాబందులతో పోరాడే
శవాల గతప్రాణాలు!
విముక్తికోసం పోరాడిన
సమరవీరుల సమాధి శిఖరాల్లో
సింహాసనాలు వేసుకు కూర్చుండిన
కొత్తరకం పరిపాలకులారా!
శవాలు బ్రతుకుతాయి, లేస్తాయి
మీతో మళ్లీరణం చేస్తాయి.
గతవీరుల దివ్య సమాధుల
పూలు దొంగిలించి పోయి
నిప్పులు కురిపించుతున్న
కొత్త రకం పాలకులారా!
ద్రోహం, అన్యాయం, కృత్రిమం.
చుట్టు కున్న చీకటి పరదా
దించి, దించి
కవాటాలు మూసి మూసి
హద్దులు కాపలాలు కాసి
వెలుతురు, సీసాల పోసి
కార్కువేసి సీలుచేసి!
అన్యాయం, ద్రోహం, కృత్రిమం.
అగ్ని పతాకం రెక్కలు
విచ్చుకున్న ఆకలి డొక్కలు
పసి పట్టిన సర్ప ఫణమ్ములు
తరతరాల
దావాగ్నిని
వడగట్టిన
వర్తమాన రేఖలు
పేలిన తుపాకీ గుండ్లవర్షం -
తలవంచని మానవ ప్రాణాలకు హర్షం!
ఓ ప్రాచీ దిఙ్నివాసులారా!
నాగటి చాళ్ళలో నడిచే
రైతులార! రుద్రులార!
మర చక్రం గిరగిర తిప్పే
కూలీల్లార! వీరభద్రులార!
మీరేనా? చీకటింటి
తలుపులు తోసి పిలుస్తోంది?
రక్తకవాటం కిర కిర!
AndhraBharati AMdhra bhArati - dAsharathi - rudravINa - kavATaM - dASarathi kRiShNamAchArya - Dasaradhi Krishnamacharya ( telugu andhra )