| కవితలు | దాశరథి కవితలు | రుద్రవీణ |
| 13. రుధిరపక్షులు | |
|
నీలి మబ్బులు తేలి యాడే నింగి నిండా రుధిర పక్షులు. | |
|
రుధిర పక్షుల రెక్క బరువుకు కూలిపోయిన గాలి సౌధం. | |
|
గాలి సౌధం పునాదుల్లో కాళ్లు విరిగిన కొత్తరాజులు. | |
|
కొత్తరాజుల గుండియల్లో వచ్చి వ్రాలిన పక్షి రెక్కలు. | |
|
పక్షి రెక్కల పదను కోతకు తెగిన కాలం కొత్త రంగులు - | |
|
పేద సాదల స్వేద బిందు స్వాదు రుచితో పొంగు రంగులు. | |
|
నేను మీటే రుద్రవీణకు స్వరం నేర్పే రుధిర పక్షులు. | |
|
దిక్కు దిక్కులు ముక్కు మొనతో రక్కి వచ్చిన రుధిర పక్షులు. | |
|
రుధిర పక్షులు రుధిర పక్షులు. | |
|
బధిర లోకం ప్రాణ వాయువు బాగుచేసే రుధిర పక్షులు. | |
|
చీకటింటికి చిన్ని కిరణం తెచ్చి విడిచే రుధిర పక్షులు. | |
|
కాలమార్గం మీద నడచే 'కారు' టైరుకు గాలిపోసే | |
|
రుధిర పక్షులు రుధిర పక్షులు. | |