కవితలు దాశరథి కవితలు రుద్రవీణ

ప్రకాశిక

కోటి తెలంగాణ ప్రజల ఏకైక మహాకంఠవీణాధ్వని వినాలంటే దాశరథి కావ్యగానం వినాలి.

    నా తెలంగాణ, కోటిరత్నాల వీణ

అని కంఠమెత్తి దాశరథి పాడుతున్నప్పుడు తెలంగాణ మహాప్రజ సముద్ర జలాల మాదిరి కరుళ్లెత్తి పొంగి వస్తుంది.

దాశరథి గీతాలు వినని రసికులు తెలంగాణ మందుండరు.

దాశరథిని ప్రేమించని సాహిత్యికులు తెలంగాణలో లేరు.

దాశరథిచే స్వీకరింపబడని కావ్యవస్తువు తెలంగాణలో లేదు.

దాశరథియే తెలంగాణము, తెలంగాణమే దాశరథి.

ఆయన గీతములు మహానగరముల నుండి పల్లెపట్టులదాకా, శిథిలాలయముల నుండి జైళ్లలో దాకా, ధనికునినుండి పేదవాని దాకా, మితవాదినుండి తీవ్రవాది దాకా, ప్రసరించినవి.

ఓరుగల్లు శిల్పాలను చూచి ముగ్ధుడై దాశరథి, 'శిల్పి'ని గూర్చి రచించిన పద్యాలు విశేష ప్రశస్తి నార్జించినవి.

సుత్తెల మ్రోతతో అలసి
    చొక్కిన కొండలపిండు లెల్ల నో
రెత్తి నినాద మిచ్చినవి
    "ఈ వెటువంటి మనోజ్ఞ రూపకం
బెత్తు మటన్న నెత్తెదము;
    ఎందుల కిట్టుల మట్టి మట్టిగా
మొత్తెద వోయి శిల్పి కుల
    భూషణ! శైల శిలా ప్రపేషణా!

నిను గని కొండ లన్ని రమ
    ణీ కుచపాళికలై, కపోల మో
హన ఫలకమ్ములై, భ్రుకుటు
    లై, కుటిలాలక జాలమై, సురాం
గనలయి రూపు దిద్దికొన
    గా ఉలితో అమృతమ్ము చల్లి జీ
వనములు పోసి పోయెదవు;
    బ్రహ్మవు శిల్పికులావతంసమా!

మహారణ్యమైన తెలంగాణా భూమిని మాగాణ మొనర్చిన రైతుదేకాని తెలంగాణము, నిజాం నవాబుది కాదని నిజామాబాద్‌ సెంట్రల్‌ జైలులో సింహగర్జన మొనర్చినాడు దాశరథి.

ప్రాణము లొడ్డి ఘోర గహ
    నాటవులన్‌ బడగొట్టి, మంచి మా
గాణములన్‌ సృజించి, ఎము
    కల్‌ నుసిజేసి పొలాలు దున్ని, భో
షాణములన్‌ నవాబునకు
    స్వర్ణము నింపిన రైతుదే, తెలం
గాణము రైతుదే; ముసలి
    నక్కకు రాచరికంబు దక్కునే?

శ్రీ దాశరథి రచనలను సంపుటీకరించి 'సాహితీమేఖల' వారు 'అగ్నిధార' ప్రచురించినారు. మేము మరికొన్ని రచనలను మరొక సంపుటిగా 'రుద్రవీణ' పేరుతో ప్రచురిస్తున్నాం. దాశరథి రుద్రవీణను సద్వినియోగం చేయటానికే మ్రోగిస్తా నంటున్నాడు.

చింతల తోపులో కురియు
    చిన్కులకున్‌ తడిముద్దయైన బా
లెంత యొడిన్‌ శయించు పసి
    రెక్కల మొగ్గనువోని బిడ్డకున్‌
బొంతలు లేవు కప్పుటకు;
    బొంది హిమంబయిపోవు నేమొ? వా
యింతును రుద్రవీణ పయి
    నించుక వెచ్చని అగ్నిగీతముల్‌.

నిరుపేదల తరతరాల బీదతనం ఊడ్చివేయబడాలనే తొందర దాశరథి ప్రతిమాటలో వినిపిస్తుంది. దయనీయులైన శ్రామికులు దాశరథి అభిమాన వస్తువులు.

ఒకనాటికి ఈకాలం పల్టీ తిన్నప్పుడు
ఈ జగత్తు నవపాంచజన్య నాదం విన్నప్పుడు
నేటి వన్నీ ఆనాటికి తప్పులు
పుచ్చిపోయి పురుగెక్కిన పప్పులు.

పరిణామం తప్పదనీ పరిణామవాదుల్ని హతమార్చాలనే ప్రయత్నం నిష్ఫలమనీ దాశరథి సలహా.

రుద్రవీణను దాశరథి రచనకు చిన్ని మచ్చు తునకగా ఆంధ్రరసికులకు అందించడానికి ప్రయత్నించిన మా కృషిలోని మంచిచెడుగులను పాఠకులు ఆదరముతో స్వీకరించగలరని ఆశ.

ఇందులోని కొన్ని రచనలు "స్వతంత్ర" మొదలైన పత్రికలనుండి సేకరించినాము. మాకు అట్టి అనుమతి నొసంగిన ఆయాపత్రికా సంపాదకులకు మా అభివందనములు.

తెలంగాణ మహాప్రజలచే అనేకమార్లు సన్మానింపబడి, సత్కరింపబడి, 'మహాకవి' 'కవిచక్రవర్తి' 'కవిసింహ' ఇత్యాది బిరుదములనందిన శ్రీదాశరథి తమ రచనలను సంపుటీకరించుటకు మాకు అవకాశమొసగినందుకు వారికి మాధన్యవాదములు.

పండిత చిలుకూరి శ్రీరాములు
(ప్రకాశకులు)
1950
గార్ల.

AndhraBharati AMdhra bhArati - dAsharathi - rudravINa - dASarathi kRiShNamAchArya - Dasaradhi Krishnamacharya ( telugu andhra )