కవితలు దాశరథి కవితలు రుద్రవీణ
అంకితము
 
తెలంగాణకు
ననుగని పెంచినట్టి కరుణామయి నా తెలంగాణ! నీ గృహాం
గణ వనసీమలో బరుసు కంపలు నాటిన మా నిజాము రా
జును పడద్రోసినట్టి రణశూరుల వెచ్చని నెత్రు చుక్కలే
మణికృత దీపమాలికల మాదిరి నీకు వెలుంగు లిచ్చెడిన్‌.
పాటలు పాడితిన్‌ తెలుగుబాబులు నిద్దురమేలుకోగ, పో
రాటము సేయగా, కరకు రాచరికమ్మును కూలద్రోయగా;
కోటి గళాల నొక్కకడ గూర్చితి విప్లవ శంఖమొత్తితిన్‌
నాటికి నేటికిన్‌ తెలుగు నాటికి వెచ్చదనమ్ము లూదితిన్‌.
వే స్తంభముల గుడి వ్రాయించుకొన్నది
    నాచేత ఏకశిలా చరిత్ర
వీర రుద్రమదేవి వినిపించుకొన్నది
    నాచేత జన్మజన్మాల కథలు
పోతన్న కవి కలబోయించుకొన్నాడు
    నాచేత నేటి ఆనాటి కవిత
ముసునూరి కాపన్న మ్రోయించు కొన్నాడు
    నా చేత క్రాంతి వీణా చయమ్ము
నాకు తల్లివి నీవు, నే నీకు సుతుడ;
నల్ల నాటికి నేటికి ననుదినమ్ము
మ్రోయు చున్నావు నాగళమ్మున, కలాన
నా తెలంగాణ! కోటిరత్నాల వీణ!
తుంగభద్రానదీ భంగమ్ము లిరుక్రేవ
    లొరసి పారుచు రుచు లరయుచుండ
కృష్ణవేణీ తరంగిణి నాలుకలు సాచి
    దరుల రెండిట 'మజా' లరయుచుండ
గోదావరీ వీచికా దివ్య హస్తమ్ము
    లిరుకెలంకుల మన్ను తరచుచుండ
బోటి కిన్నెరసాని మాటిమాటికి పొంగి
    రెండు వైపుల దరు లండ గొనగ
ఇటు నటను తెల్గునేల లారటము జెంది
కలసి పోజూచుచున్న యట్టులనె తోచు;
కలపి వేయుమి, నా తెలంగాణ తల్లి!
మూడుకోటుల నొక్కటే ముడి బిగించి.
నా కోర్కె తీర్పు మమ్మా!
నీకు మదీయాశ్రుకణ వినిర్మిత మాలా
నీకమ్ము సమర్పించెద
గాక; విశాలాంధ్రమనెడి కల నిజమగుతన్‌.
AndhraBharati AMdhra bhArati - dAsharathi - rudravINa - aMkitamu - dASarathi kRiShNamAchArya - Dasaradhi Krishnamacharya ( telugu andhra )