కవితలు దీపావళి - వేదుల సత్యనారాయణ శాస్త్రి 30. ఆషాఢమేఘము
30. ఆషాఢమేఘము
ఏ విరహార్తుఁడేని హృదయేశ్వరి సన్నిధి కేగజాలు వా
ర్తావహుఁ గోరి, యే గిరినితంబతటమ్మున నేని చిక్కి, వా
పోవుచునుండెనేమో యని, పొంచి దెసల్‌ పరికించి చూచుచు
న్నావె ప్రవాసదుఃఖితమనఃప్రవణోత్సవమా, పయోదమా!
ఈ యచలేంద్రు డౌదల ధరించిన మేలి హొరంగు నీలి పా
గాయటు, వేగుబోక చిరుగాలికి నట్టిటు లూగు ని న్గనన్‌
నా యెద కాళిదాసకవినాటి యొకానొక యక్షువేదనా
ఖ్యాయిక జ్ఞప్తివారి కరుణార్ద్రమగున్‌ స్వగతానుభూతిగన్‌
లే దలనాటి యుజ్జయిని, లే దలకాపురీ ప్రయాణ స
మ్మోదము, లేడు ప్రేమభరముగ్ధుడు నాటి గిరిప్రవాసి, భా
నూదయచిత్రితేంద్రధనురుజ్జ్వలమూర్తివి నీవె నాటి మ
ర్యాద ప్రవాసిబాంధవుడవై కనుపించెదవోయి నేటికిన్‌
తరుణీదూరులు, ప్రేమజీవనదరిద్రాణుల్‌, నభోమాస కా
తరులౌ దీనుల దుఃఖబాష్పకణముక్తాపాళి వార్తాక్షరో
త్కరముంబోలె వహించి, యంబరపథాంతర్నిత్యయాత్రాధురం
ధరతన్‌ మానవు నేటికిన్‌ ప్రణయదౌత్యం బీవు మేఘోత్తమా!
తొలకరి పాటపాట జడితుంపరలన్‌ పయిపై గ్రసింపగా
దలచి, బలాకలున్‌ కలరుతమ్ముల నావలె నీకు స్వాగతో
క్తులు పచరించుచున్న వవిగో! తడిదుక్కిపొలాల తావులం
గలసిన పైరగాలితరగల్‌ చలచల్లగ సేదదేర్పగన్‌
కాటుకలేని సోగతెలిగన్నుల ముత్తెము లట్లు జారు క
న్నీటికణాలజాలు కుచనిర్గుణహారత బూనగా, ఎడం
బాటువగన్‌ నినుం గనెడు భామల పాటనలేని పాపటన్‌
నీటుగ తీర్చి దిద్దెదవు నీ తొలినీటి మెరుంగు ముత్తెముల్‌
నీ యతసీప్రసూనరమణీయనవాకృతి పండువట్లు క
న్దోయికి కానరా, అగరుధూపసుగంధిలమౌ ప్రియావినీ
లాయత కేశపాశము హృదంకితమై వలపుంగలల్‌ కనం
బోయెడువారె యిప్పటిఘనుల్‌ నవనాగరకత్వకింకరుల్‌
మాసినవాసనామధురిమమ్ముల భౌతికశుష్కజీవన
గ్రాసపుమేరలన్‌ గడచిరాని తలంపుల బోవు ప్రేమ స
న్యాసుల నీరసంపు హృదయంబుల కేమిటి కిప్పు డీ నభో
మాసనిరీక్షలున్‌, విరహమాధురులున్‌, దయితాప్రవృత్తులున్‌
AndhraBharati AMdhra bhArati - kavitalu - dIpAvaLi - 30. AShADhamEghamu - gautamI kOkila vEdula satyanArAyaNa Sastri ( telugu andhra )