కవితలు దీపావళి - వేదుల సత్యనారాయణ శాస్త్రి 31. శరదుత్సవము
31. శరదుత్సవము
నా హృదయ మిప్పు డరమూత నగవులందె
కనెను శాంతి దేవత కడగంటిచూపు
బ్రతికినన్నాళ్ళ కీ ముహూర్తమున విరిసెఁ
దొలివలపు దొల్కు జీవమాధుర్యరుచులు
మిగులఁ గంపించు నా పేద మేని నిపుడు
సుమమృదులహస్త మేదియో నిమురుచుండె
కన్నతల్లి దీవనతోడి కౌఁగిలింత
జారు తీయని కన్నీటిచలువ లొలయ
విరిసెఁగాఁబోలు! జగదధీశ్వరుశిఖావ
తంసకుసుమమ్ము, దిగ్దిగంతమ్ములందు
సౌరభోచ్ఛ్వాసముల వెదఁజల్లుచున్న
దానుకూల్యమ్ముతో శారదానిలమ్ము
ఇంత లేమబ్బు చిఱుతున్కయేని లేదు
విప్పిరేమొ నిశారాజి వెల్లగొడుగు;
ఏమి శ్రవణోత్సవ మ్మిపుడీ విశాల
గగనమున కోటి విజయశంఖములు మ్రోగు
చంద్రికావసనాంచలోచ్చాలనములఁ
జిరవిరహవాసనల నెగఁజిమ్ముకొనుచుఁ
తాండవించెడు నమృతసౌందర్యలక్ష్మి
యుర్వి కీనాఁడె తొలిశరదుత్సవమ్ము
నరకలోకపుఁ జీఁకటితెరలవంటి
వెన్ని నిశ లేగె నొక స్వప్నమేని లేక
ఇంత సౌందర్య మింత ప్రశాంతిసౌఖ్య
మింత మాధుర్య మెట దాగె నింతవరకు?
ఎంతస్వేచ్ఛయొ! నేఁ డీ యనంతసృష్టి
గాన మొనరించుఁ బ్రతిజీవకణముగూడ
శైలగర్భాంతరాళ నిర్ఝరమువోలె
నెదియొ కళపెళలాడుఁ బై కెగయ నెడఁద
బాష్పకుంఠితకంఠానఁ బాడలేక
నా యెడఁద నింపుకొందు సౌందర్యరసము
నిలుపుకోలేన, నాలోన నేన విరిసి
రాలిపోదు వృంతచ్యుతప్రసవ మట్లు
ఓ సఖీ! ఓ సుహాసినీ! ఓ శరద్వి
భావరీనర్తకీ! కవిభావనా వి
లాసినీ! నిత్యసైరంధ్రి! ఓ సమస్త
లోకమోహిని! ఓ స్వప్నలోకరాజ్ఞి!
ఈ యమృతశాంతియే చాలు నెపుడు నీ క
టాక్షభిక్షున కాజీవితాంత మింక
శ్రీచరణలాక్షతోడ నాహృదయకుసుమ
దళము ననురాగరసరంజిత మ్మొనర్తు
AndhraBharati AMdhra bhArati - kavitalu - dIpAvaLi - 31. sharadutsavamu - gautamI kOkila vEdula satyanArAyaNa Sastri ( telugu andhra )