కవితలు దీపావళి - వేదుల సత్యనారాయణ శాస్త్రి 29. ప్రభాతగీతి
29. ప్రభాతగీతి
విరహబాష్పతుషారమ్ముఁ గురిసి కురిసి
కనుమొగిడ్చెను హేమంతకాలరాత్రి
జీవచైత్రప్రభాతవంశీరవమ్ము
మ్రోగుచుండె రోదసి మూలమూలలందు
సప్తరథ్యప్రయాణ హేషారవమ్ము
సాగెఁ దూరుపు పైడిమోసాలమ్రోల
నరు లుపేక్షించు తృణదళాంతర హిమాశ్రు
కణముపై లోకబాంధవు కరము సోకె
ఓ విషాద ప్రపంచయాత్రా విరాగి!
ఓ నిరాశా పథైక పురాణపాంథ!
ఓ ప్రవాసదుఃఖాశ్రుపయోదమూర్తి!
రేయి కాటుకనుల జారిన విషాద
బాష్పవారి నొకేసారి పారఁబోసి
యీ మధుప్రాతరాహ్వానసామగాన
మంచుమోయ జీవనపాత్ర నించుకొమ్ము;
పూవుపూవునఁ దావి గుబుల్కొనంగఁ
బూలవన మెల్ల నిలువునఁ బులకరించె
కొదమ తెమ్మెరపిల్లనగ్రోవితోడఁ
బులుగుగొంతుక పాటరెక్కల విదల్చె
అణువణువుగూడ శుభగీతు లాలపించు
వందనోత్సవమందిరాళిందసీమ
నీరవగళమ్ముతో నీవు నిలువరాదు
భూతకాల దినాంతానుభూతితోడ
భావియుగముల కల్యాణపథముఁబట్టి
వెలుఁగునీడల జీవనవేణు వూది
పాడుకొనుమ యీనాఁటి ప్రభాతగీతి
AndhraBharati AMdhra bhArati - kavitalu - dIpAvaLi - 29. prabhAtagIti - gautamI kOkila vEdula satyanArAyaNa Sastri ( telugu andhra )