కవితలు దీపావళి - వేదుల సత్యనారాయణ శాస్త్రి 26. ఆహ్వానము
26. ఆహ్వానము
నిత్యహింసారిరంసావినిద్రరుద్ర
భవనవాటికాద్వారకవాటములను
దెరచుకొని, యో యమృతశాంతి! దివ్యకాంతి!
నీ సుఖస్వప్నలోకశోభాసమీర
చాలితవిశాలపక్షాంచలాలు సోకి
తూలిపడిపోవు బాధాతివేలహృదయ
వేదనాజాలములఁ ద్రోసివేసికొనుచు
అస్తగిరివాసినీ! జీవితావసాన
శైశిరతమోభిసారికా! స్వప్నరాజ్ఞి!
ప్రేయసీ! యొకమారు విచ్చేయు మిటకు
లోకలోకాల శాంతి వెల్లువలువారు
నెఱ్ఱజీరల వాల్గను లెత్తి నవ్వి
చారుహేమంతసంధ్యాతుషారసార
శీతలకృపామృతాసారసేచనములఁ
దప్తహృదయమ్మునకుఁ జల్లదన మొసంగ
ప్రేయసీ! ప్రేయసీ! దయచేయు మిపుడు
సకలలోకాధినాథపూజాసనాథ
కనకపీఠికోజ్జ్వలదలంకారమైన
నీ జిలుగు పైట చెరఁగు లేనీడలందె
జీవలోకనిరంతరాశావికాస
వాసనోచ్ఛ్వాసములఁ బ్రోవు చేసికొనెడు
కోమలాశ్రుమౌక్తికమాలికామనోజ్ఞ
మైన నీ హృదయాన న న్నదుముకొనఁగ
ధిక్కృతప్రేమచరమాతిథీ! మహాబ్ధి
పారదూరప్రవాసినీ! ప్రాణశాంతి
గాయనీ! ప్రేయసీ! దయసేయు మిటకు
మరణదేవతవో, సుధామధురవిధుర
జీవశాంతివో, ప్రేమైకజీవకళవొ
విలయసౌందర్యధాత్రివో, విశ్వగాన
మోహినివొ, యిహదుఃఖతమోనియతివొ
ఎవతె వైన సరే; క్షణమేనిగాని
కష్టనిష్ఠురశోకలోకమ్మునందు
వలపు తొలఁగిన యీ పాడుబ్రతుకుబరువు
నీడ్వలే కేడ్వలే కిట్టు లేడ్చు నన్ను
త్వద్భుజాశ్లేషమృదులబంధమునఁజేర్చి
కాలజలధితరంగాల జోలఁ బాడి
మాతృవక్షమ్మువోలె ప్రేమప్రసన్న
మైన యద్వంద్వకాంతి సీమాంతరమున
శాశ్వతసుషుప్తి ముంచి ప్రశాంతుఁజేయ
ప్రేయసీ! ప్రేయసీ! దయసేయు మిపుడె
AndhraBharati AMdhra bhArati - kavitalu - dIpAvaLi - 26. AhvAnamu - gautamI kOkila vEdula satyanArAyaNa Sastri ( telugu andhra )