కవితలు దీపావళి - వేదుల సత్యనారాయణ శాస్త్రి 27. పూర్ణిమ
27. పూర్ణిమ
ఆ యుదయాద్రి నుండి యరుణారుణమౌ ముఖ మెత్తి గాఢల
జ్జాయుత యౌ నవోఢవలె సందడి సేయక తొంగితొంగి లో
లాయతదృక్కులన్‌ దశదిశాంతరముల్‌ పరికించి జీర్ణమై
పోయిన నా కుటీరపథమున్‌ గుఱుతింతువు చాటుచాటుగన్‌
ఈ వలిగాడ్పు లెంత వడకించుచునున్నను, నీ ప్రవాళరే
ఖావిలసన్ముఖమ్ము దడిగట్టెడు సిగ్గున సంచలించినన్‌
మోవగరాని ప్రేమను విముక్తగవాక్షపథమ్మునుండి నా
క్రేవకు వత్తు వెట్లొ పులకింపఁగ నా తృణకీర్ణశయ్యయున్‌
పొంగులుదేరు తీయవలపుల్‌ హృదయమ్మును ముట్టడింపఁగా
వంగి సుషుప్తిచే ముడుపువారిన నా కనుబొమ్మలన్‌ సుధా
లింగితచుంబనమ్ములఁ జలింపఁగఁ జేసి సుఖోదయవ్యథా
భంగములం గలంతువు భవన్మృదులోచ్ఛ్వసితానిలాహతిన్‌
ఆ నునుమబ్బు కౌఁగిళుల కందని నీ లవలీమనోజ్ఞమౌ
మేని సుధాద్యుతు ల్నిదుర మేల్కొలుప న్నవమాఘ మాససం
ధ్యానిల మట్లు నా తనులతం బులకింపులతో స్పృశింప, బా
ధానిశితంబు నా పువుటెదం గదియింతువు నీ యెడందపై
ఈ తృణశయ్యయందె నిదురించెద మిర్వురముం బరస్పరా
ద్వైతగతాత్మవృత్తిని భవద్భుజవల్లుల నన్ను బంధితుం
జేతువు నీవు, నే నపుడు నీ యమృతాసవ మెల్లఁ ద్రావుచున్‌
రాతిరి నొక్క స్వప్నమధురక్షణ మట్టుల వెళ్ళఁబుచ్చుదున్‌
AndhraBharati AMdhra bhArati - kavitalu - dIpAvaLi - 27. pUrNima - gautamI kOkila vEdula satyanArAyaNa Sastri ( telugu andhra )