కవితలు దీపావళి - వేదుల సత్యనారాయణ శాస్త్రి ఆరాధన
ఆరాధన
-౧-
ఆమె నవనీత హృదయ, నా యంతరంగ
శాంతిదేవత, ఆశాపథాంతరాళ
పారిజాతమ్ము, ప్రేమజీవన విభాత
కైశికీగీతి, నా తపః కల్పవల్లి!
ఆమె జగదీశమకుటాగ్రసీమ నుండి
యుర్విపై జారిన సుధామయూఖ రేఖ!
ఆమె మూడు కాలాల కల్యాణమునకు
అవతరించిన యొక పవిత్రానుభావ,
మామె నా జన్మజన్మపుణ్యములు పండి
ప్రాప్తమైన పద్మాసీన భాగ్యలక్ష్మి
ఆమె పదసన్నిధాన దివ్యస్థలాన
భక్తి నమ్రుఁడనై నిలంబడిన యపుడు,
తలఁపునకు వచ్చు, నా పేదతనము నాకు!
-౨-
'చెలియ! ఏ దేవి మంగళాశీ స్సుమములు
పరిమళించినవో మన శిరములందు
ఒక తపస్సిద్ధివోలె నేటికి లభించె
నిరువురి మనోరథమ్ముల కేకఫలము!'
అనిన తారళ్యవిస్తారితాక్షి యగుచు,
'స్వామి, మన తోటలో నీ వసంతవేళ
పూచిన సుమమ్ము లా దేవి పూజ కొరకె!'
అనుచు, నా చేయి తన చేత నదుముకొన్న
యామె పద సన్నిధాన దివ్యస్థలాన
నాక కల్లోలినీ పదన్యాసమునకు
దర వినతమైన హరజటాభరమువోలె
నతుఁడనయ్యు, మహామహోన్నతి వహింతు!
-౩-
మాతృదేవతా కల్యాణమందిరమ్ము
ద్వారమున అడ్డుపెట్టు పూజారి లేడు
బంధములు లేవు లేదు నిర్బంధ మెపుడు
నేల నాలుగు చెరగుల నిఖిల శృంఖ
లా విమోచనోత్సవ సముల్లాస మలమె
ఇంక భయమేల? సంశయమేల మనకు?
రమ్ము ప్రేయసీ! శుభ ముహూర్తమ్ము దాట
కుండ నుభయ జీవిత కాంక్ష లొకటి జేసి
నాల్గు చేతుల మ్రొక్కుకొందము సవిత్రి
శ్రీచరణముల, కాశయసిద్ధి కోస
మనిన, ఆనంద విస్తారితాయతాక్షి
యగుచు కేల్దోయి నా గళమందు పూల
మాలగాఁజేసి యుత్సాహ మగ్నయైన
ఆమె పద సన్నిధాన దివ్యస్థలాన
పదియు నాల్గేండ్లపాటి యౌవన సుషుప్తి
తేలి పోయిన యూర్మిళాదేవి మ్రోల
ప్రణయ వినమితుఁడైన లక్ష్మణుఁడువోలె
ధన్యహృదయ రాజ్యాధిపత్యము వహింతు
-౪-
పాలకడలిని శేషతల్పమ్ముమీద
యోగ నిద్రలోనుండి యధోక్షజుండు
మేలుకొని విప్రయోగభా రాలసుఁడయి
కార్తిక జ్యోత్స్నలోఁ దన కడకు వచ్చు
కాలమని, హర్షసంభ్రమాందోళిత యగు
శ్రీ తులసి చెంత వేదికా సీన యగుచు
"నన్ను పాలింప నా ప్రాణనాథ! నడచి
వచ్చితే" యను త్యాగయ్య వారి కృతిని
మ్రోగునది తంత్రియో గలమ్మో ఎరుంగ
రాని యట్టుల శ్రావ్య స్వరమ్ముతోడ
వీణపై తన్మయత నాలపించు చున్న
ఆమె పద సన్నిధాన దివ్యస్థలాన
అద్భుతానంద పారవశ్యమ్ముతోడ
పాట వినుచును నే నిలంబడిన యపుడు
శారదా కరుణా కటాక్షమ్ము గన్న
చిర దరిద్రుని ప్రజావిశేష మట్లు
సభ్యతాపూర్ణ సౌమనస్యమ్ము గాంతు.
AndhraBharati AMdhra bhArati - kavitalu - dIpAvaLi - ArAdhana - gautamI kOkila vEdula satyanArAyaNa Sastri ( telugu andhra )