| కవితలు | దీపావళి - వేదుల సత్యనారాయణ శాస్త్రి | 36. ఆశాగానము |
| 36. ఆశాగానము | |
| ఏసడి లేక యీ ప్రకృతి యెల్ల నిశీథ తమోనిబద్ధమై నీ సుకుమారహస్తముల నిద్దురవోయెడు మౌనవేళ, నీ వే సరిజేసి యీ శిథిలవీణను బాడు మటంచు నాపయిన్ ద్రోసెద వేల? తీగె తెగునో, శ్రుతి దప్పునొ, పల్కదో ప్రభూ! | |
| మావులగుంపులందు మధుమాసములన్ వికసించు కోకిలా రావమువోలె రాగమధురమ్ముగ వీణ నదింపఁజాల, నన్ బోవఁగ నిమ్ము; ప్రేమరసపూరిత విశ్వవిలీనగాన మీ వే వినిపింతువేని సుఖియించెద నే నది యాలకించుచున్ | |
| ఏవిధినైనఁ బాడు మనియే వచియింతువయేని ప్రేమమై నీవె రచించి నాకుఁ గరుణించిన వీ ప్రణయార్ద్రగీతికల్ గావున, నావిశుష్కితగళమ్మున నీ కరుణాసుధారస శ్రీవిభవమ్ము నింపి మధురింపుము నే శ్రుతిగల్పి పాడెదన్ | |