| కవితలు | దీపావళి - వేదుల సత్యనారాయణ శాస్త్రి | 35. రాధ |
| 35. రాధ | |
| పవనపులకిత చంద్రాతపప్రసన్న చారుశారదయామినీసమయమందు వీథివీథుల మధురలో వెదకివెదకి చేరుకొంటిని బృందావిహారు నిన్ను | |
| దూరముననుండి నీ మురళీరవమ్ము హృదయమున సోకినంత మే నెల్ల మరచి తిరుగుచుంటిని యమునానదీ వివిక్త పులినసీమల వెఱ్ఱినైపోయి నేను | |
| రవికరోద్దీప్తహిమశీకరమ్మువోలె రమ్యపింఛము చిత్రవర్ణములఁ దొలుక శిరము నూపుచు మోవిపై మురళి నూని యేది మరియొకమారు వాయింపు మోయి! | |
| మంజులసుమామృతములోని మధురిమమ్ము మధురచంద్రాతపములోని మార్దవమ్ము మృదుసమీరమ్ములోని పరీమళమ్ము కలవు గోపాల! నీ వేణుగానమందు | |
| ప్రకృతి పులకింప, యమునాస్రవంతి పొంగ భావము చిగుర్పఁ, బిల్లనగ్రోవి నూది పరవశం జేసి నన్ను, గోపాలకృష్ణ! ప్రేమ తనివార నొకముద్దుఁ బెట్టుకొనుము | |