కవితలు దీపావళి - వేదుల సత్యనారాయణ శాస్త్రి 16. ఆవృత్తి
16. ఆవృత్తి
ఆ ప్రశాంతనిశాజఠరాంతమందు
కలతనిదురలో కలల్‌ గాంచుచున్న
గౌతమీనది నా మనోగతవిషాద
తమము నంతయు తనలోన దాచుకొనియె
ఆ నదీసైకతముల నా యడుగుజాడ
చెరపివేయగ వెనువెంట నరుగుదెంచు
గాలితరగల చల్లనికడుపులోన
కన్ను మూసెను నా యూర్పుగాడ్పు లెల్ల
చెడ్డయో మంచియో మహాసృష్టియందు
జరుగు విషయమ్ములను తటస్థముగ నా య
నంతగగనమ్మునం దుండి యరయుచుండు
తారలె మదశ్రుకణముల నేరుకొనియె
నేనె మిగిలితి నీ గౌతమీనదీప
విత్రగర్భమ్ములో మ్రోత వెట్టుచున్న
యుగయుగాంతర విశ్వమహోగ్రదుఃఖ
జీవగీతాల కావృత్తి చెప్పుకొనగ
AndhraBharati AMdhra bhArati - kavitalu - dIpAvaLi - 16. AvR^itti - gautamI kOkila vEdula satyanArAyaNa Sastri ( telugu andhra )