| కవితలు | దీపావళి - వేదుల సత్యనారాయణ శాస్త్రి | 15. ఈనాఁటికి |
| 15. ఈనాఁటికి | |
| కలఁత యెరుఁగని లేఁతప్రాయపుఁ దలిరుటెడఁదను తీగవారిన చెలిమి జ్ఞప్తికి వచ్చి కన్నులు చెమ్మగిలిపోవున్ | |
| వల పెరుంగని నాటి చేఁతలఁ దలఁచుకొని నపు డెల్ల నేదో మొలకనగ నీ యెడఁదఁ బూవులు పూచి నటు లౌను | |
| దరిని బెరిగిన మ్రాకు లచ్చపు సరసిఁ జాయలుదేరు పోలిక చిఱుఁతప్రాయపు వలపునీడలు చిత్తమునఁ బ్రాకున్ | |
| కదలికదలని యేటినురుగును బొదవు సందెనిగార మటు, లె య్యెదియొ సుందరరూపపరిచయ మెద గుబాళించున్ | |
| తెరగ విరిసిన మసకచీఁకటి మరుగునం దరళించు వెలుఁ గటు మరుపులో నొక పూపప్రాయపు మమత మినుకుమనున్ | |
| బ్రతుకుపై విసుగెత్తి నెమ్మది చితుకుమంటగ నుండ, స్వప్నము గతిని జ్ఞప్తికి వచ్చి యేదో కరఁచు హృదయమ్మున్ | |
| మరలు సందెల, గాలితరగల విరియుమబ్బుల నీలినీడలఁ దిరుగు పులుఁగులజతలఁ గని మే న్మరచి నిట్టూర్తున్ | |
| మింట మబ్బులు దొంతరిల్లుట కంటఁ బడినపు డెల్ల బ్రదుకుం బంట యేదో కోలుపోయిన పగిది నెద వేగున్ | |
| చిట్టివలపులగూడు గట్టిన చెట్టు వేరొక దారి కాఁగాఁ బిట్టవలె నెద నేఁటి కడవులఁ బట్టి తిరుగాడున్ | |