కవితలు దీపావళి - వేదుల సత్యనారాయణ శాస్త్రి 17. అశాంతి
17. అశాంతి
కనికరము లేని దుఃఖవేదనలసెగల
పొగలఁ వెలిఁజిమ్ము వలపుటూర్పులభరమ్ము
మోసికొని, నేనె నాలోన మూల్గుకొనుచు
గాలివోలె సమస్తావకాశములను
నెడతెఱపి లేక తిరుగాడి బడలినాను
దారుణపు జీవితంపు టెడారిలోన
తీరని పిపాస నేదారితెన్ను లేక
నేనె నాదుఃఖబాష్పశోణితలహరుల
నే విసుగువేసటలు లేక త్రావినాను
కడుపుఁ గాల్చెడు మండుటాఁకటను రేఁగి
కోర్కె లొండొంటిని గ్రసించుకొనెడు కొలఁది
నొడ లెరుంగక కాలమృత్యువును నేనె
కొంచెముగఁ గొంచెముగఁ గబళించినాను
కాని, మ్రోడైన నాయెదలోని బరువు
దీర, నాబ్రతు కూపిరి దేరుకొనఁగ
కనికరపుఁ జూపు చిఱునవ్వుతునుక యైనఁ
గటికికఱ వయ్యెఁ బాడులోకాన నాకు
ఏకడల మిన్కు మను చుక్కయేని లేని
యీ నభము క్రుంగి కూలిపోయెడు విధానఁ
గాఱుమబ్బులె కాదు, చీఁకటులె గాదు
క్రమ్ముకొననిమ్ము, కరడులు గట్టనిమ్ము
వలపుతీపి యెరుంగని వట్టిరాతి
గుండెలోకమ్ము నిప్పులు గురియనిమ్ము,
హృదయ మున్నంతవరకు నాప్రేమకాంక్ష
బ్రతికి యున్నంతవర కేడ్చి బ్రతుకుచుందు
ఏ వెలుఁగు నన్నుఁ దన దరి కీడ్చుకొనునొ
ఏ తలఁపు దారి సూపునో
AndhraBharati AMdhra bhArati - kavitalu - dIpAvaLi - 17. ashAMti - gautamI kOkila vEdula satyanArAyaNa Sastri ( telugu andhra )