| కవితలు | దీపావళి - వేదుల సత్యనారాయణ శాస్త్రి | 14. ఉత్కంఠ |
| 14. ఉత్కంఠ | |
| అనుపమప్రణయాతిథేయమ్ముతోడ పారఁదెరచితి హృదయకవాట మిపుడె మొయిలునీడలచీకట్లు ముసరుకొనిన నీగృహము నీవె కైసేయ నేగుదెమ్ము | |
| తేనెతావులబరు వోపలేని పూవు ప్రొద్దుపొడుపునకై వేగిపోవు పగిది బ్రదుకు బ్రదుకెల్ల తీయని వలపు నింపి వేచియుంటి నీరాక కీ వేళ స్వామి! | |
| వలపు లొలికెడు పూవులు వాడిపోయె కనకపీఠిక హారతి కునుకుచుండె తమ్మిరేకులసురటి పొంకమ్ము దొరగె నొంటి నిఁక నెంతసే పిటు లోర్తు స్వామి! | |
| ఏమి దోషమ్ము దలఁచి న న్నీ వియోగ శోకమున ముంచి బాధింపఁ జూచె దీవు చెప్పరా దొకొ, యిటకు రా నొప్పవేని వెదకికొనివత్తు నేనె నీ పదముఁ జేర | |
| కలసి త్రోద్రోపులాడెడు కారు మొయిలు రాయిడి మునింగి భీకర మాయె రేయి దివ్యతేజస్వి! నీ వరుదేర కునికి ననదనై పడియుంటి శూన్యాలయమున | |