| కవితలు | దీపావళి - వేదుల సత్యనారాయణ శాస్త్రి | 39. అంకితము |
| 39. అంకితము | |
| నీ పదమె నమ్మి యాశల నిలిపికొనిన పడుచుప్రాయమ్ముపై జాలి పొడమదొక్కొ! ఆరిపోవని చిరవిరహాగ్నిఁ గొలిపి మృదుహృదయ మిట్టు లేల దహింతువోయి! | |
| పొలుపుతీరుల భేదమ్మె పొసఁగుఁగాక హృదయపుం దీయదనము గ్రహింపలేవె విరిసినయెడంద తరగలై వెడలు వలపు లకట గాలికి వెదఁజల్ల నర్హమగునె! | |
| యౌవనపుఁ దీయ మెడలని తీవ కపుడె పాపహేమంత కార్శ్య మేభంగి వచ్చె శ్రావణము వెళ్ళిపోని యీ రాగతటిని యెండిపోవునె హృదయేశ! ఇంతలోనె | |
| మధురమధుమాసమున గున్నమావిఁ జేరి తీయగా నిన్నుగూర్చి గీతికలు పాడ గళము సారించుకొన్న కోయిలకు నపుడె సంభవించెనె శ్రావణజలదపటలి | |
| నాదు జీవితకావ్య మేనాడు నీకు నంకితము జేసికొంటి నాయంత నేను నాటి ప్రేమాక్షరములు కన్నీటఁ గడిగి చెరపివేయ నాతర మౌనె జీవితేశ! | |