| కవితలు | దీపావళి - వేదుల సత్యనారాయణ శాస్త్రి | 38. రథయాత్ర |
| 38. రథయాత్ర | |
| పోయెద వీవు దిగ్వదనముల్ పులకింప ననంతశాంతి లో కాయతనమ్ముకంచుఁ బ్రణయార్థులు మార్గశిరాంబరాంబుద చ్ఛాయల నీ సువర్ణరథచక్రనినాదము లాలకించి కే ల్దోయి నమూల్యవస్తుతతితో గుమిగూడిరి త్రోవవెంబడిన్ | |
| తీరనియాకటన్ వగలఁదేరెడు కోరికలే పరస్పరా హారము లౌ దరిద్రసమయమ్మున, దీపమెలేని నా కుటీ ద్వారము ముందు నీకు నిలువం బని యేమని యెంచు నా యెదన్ దూరమునుండి మెల్లమెలఁ దోచెను నీ మురళీనినాదముల్ | |
| నీ రథ మేగుదెంచి యిట నిల్చిన దా క్షణమే కుటీబహిః ద్వారముచేరువం ద్వదమృతప్రభలం గని ప్రేమమౌగ్ధ్యముల్ వారగ నిల్చినా నపుడు స్వర్ణరథమ్మును డిగ్గి నీవె నన్ జేరితి వేను నీ కనుల చిర్నగవుం గని క్రుంగిపోయితిన్ | |
| నా ముఖవైఖరిం గనుగొనం దలయెత్తితి వొక్కమారు, ల జ్జామథితాలసమ్ములగు జంకెనచూపుల మాటువడ్డ నా ప్రేమమనోజ్ఞతల్ పులకరించిన వప్పుడె క్షుబ్ధమర్మమై నా మది నీ పవిత్రచరణమ్ములకున్ ముడివైచెఁ జూపులన్ | |
| నీ మధురాధరారుణిమ నిండిన నీ యనురాగహాసముల్ నా మలినాశ్రుపూరతతులం బడినప్పటి యింద్రచాపరే ఖామణిభూష లీ యెడదఁ గప్పుటచే జననాంతరామృత ప్రేమరహస్యముల్ వెలువరించుకొనన్ మరపయ్యె నీకడన్ | |
| ఆపుటకైన వీ లొదవనట్టి రయమ్మున సాగిపోయె ద్యా వాపృథివీపరీతము, భవద్విజయాంకరథమ్ము, భావనా శ్రీపథమందె చూచుకొని సిగ్గునఁ గ్రుంగి కృశించు నా యెదన్ రాపులుపెట్టె దుఃఖతిమిరమ్ముల మూఁతలువడ్డ నల్దెసల్ | |
| ఈ విరసంపు మౌగ్ధ్యమున కీ వెటు లెంచెదవో యటంచు నెం తో వెఱజెంది దివ్యరథధూళిసుగంధిలమైన దుఃఖపుం ద్రోవనె వేడియూరుపులదొంతరలం బొరలాడి చచ్చియుం జావని యాశలం బ్రణయసాగరపారముదాకఁ జల్లితిన్ | |