| కవితలు | దీపావళి - వేదుల సత్యనారాయణ శాస్త్రి | 45. అభిసారిక |
| 45. అభిసారిక | |
| రేయిరేయెల్ల కంటిపై రెప్పయిడక వేచియున్న రాడాయెనే విభుడు చెలియ! యీ వృథాభిసరణముతో జీవితమున మఱి లభింపని మధువిభావరి గతించె | |
| కోరి యాతండు బ్రతిమాలుకొన్న యపుడు పంతగించిన యీ మందభాగ్యకోస మకట! యీ రేయి నాథుఁ డాయాస మనక యరుగుదెంచునె! మనకు దురాశ గాక | |
| బరువుచే టభిసరణ నైపథ్య మింక తీసికొనుమ సఖీ! యెద తేలి కగునొ ఆడుదాని గభీరహృదంతరాను రాగ మెటు సైచు నీ యగౌరవభరమ్ము | |
| విభుని యతసీప్రసూనసన్నిభతనూ వి కాసము పదేపదే జ్ఞాపకము దెచ్చి నా యెద దహించు నీ యమునాతటమ్ము చెలియ! సంకేత మేల చేసితివి నీవె | |
| ముహురుపచితాశ్రుమలినకపోలయగుచు నావలెనె యీ నిశయు వెళ్ళిపోవుచుండె అడుగుసాగదు శూన్యగృహమ్ము జేర మానస మ్మేమొ కడు నుదాసీన మగును | |
| తనప్రియుడు వచ్చుజాడ గట్టినద యేమొ కనులు విప్పెను పద్మినీకాంత యపుడె అరుణరాగావకుంఠనాంతరమునుండి నన్నుఁగని వేకువనెలంత నవ్వు నదిగొ! | |
| చాలు నభిసరణ మ్మింకఁ జాలు సకియ! ప్రాతరారంభపవన సంగీతమునకు తటతరుకులాయముల శకుంతములు మేలు కొనకపూర్వమె యిలు సేరుకొందము పద | |