| కవితలు | దీపావళి - వేదుల సత్యనారాయణ శాస్త్రి | 46. ముక్తావళి |
| 46. ముక్తావళి | |
| పూవులరోజులు\న్ గడచిపోయె, విషాదహిమావృతాంధకా రావిల మయ్యె నీప్రకృతియంతయు, ఆకులపాటునొంది పూ దీవలు నాదు లేయెడద తీరున మ్రోడయిపోయె, నాటి యా జ్ఞావిధి స్వామి! నా కిపుడు జ్ఞప్తికివచ్చి భయమ్ము గొల్పెడి\న్ | |
| ఈ మధుమాసశోభ గతియింపక పూర్వమె పూలతోటలో కోమలపుష్పముల్ వెదకికోసి యమర్చిన ప్రేమదామము\న్ నామెడలోనె వేయు మనినా, వపు డొక్క సుమమ్మునైననా స్వామి! భవత్పదార్పణము సల్పగలేనయితిన్ విమూఢత\న్ | |
| నావలె శుష్కజీవనమునన్ దురపిల్లెడి యీ పవిత్ర గో దావరి పేదవడ్డ నినదమ్ములతో శ్రుతిగల్పి ప్రేమరా గావహదుఃఖగీతు లిపు డల్లుచు గ్రుచ్చుచునుంటి నొక్క ము క్తావళి నా పవిత్రనయనాంబుకణోజ్జ్వలమౌక్తికమ్ముల\న్ | |
| ఈ సుకుమారమాల ధరియింపుము నీహృదయమ్మునందె స్వా మీ! సుముఖమ్ములై పరిణమించు మనోజ్ఞవసంతమాససం ధ్యాసమయాంతరమ్ముల రవంత భవన్మధురానురాగ వి శ్వాసపరీమళానిలపు స్పర్శసుఖమ్ము ననుగ్రహించుచున్ | |