| కవితలు | దీపావళి - వేదుల సత్యనారాయణ శాస్త్రి | 44. పూవు |
| 44. పూవు | |
| పూచిన కమ్మతావులు గుబుల్కొను చారువసంతవేళఁ బూ జోచితసర్వవస్తువినియుక్తి నిమేషయుగప్రతీక్షతో వేచినఁ గానరావు కనుపించెదవో యికఁ బ్రావృడంబర శ్రీచికురాయమాణ జలభృత్పటలీచటులాంధమౌ తమిన్ | |
| నీ యనురాగముం దెలియనేరని నా హృదయమ్ము సంశయ చ్ఛాయల నూగుచున్నది విషాదపుఁ జీకటి రేకురేకులం దీయని వెన్నెలల్ వలచు నీ కడకన్నుల నవ్వులందె స్వా మీ! యిటు లెంతకాల ముడికింతువు ఱెక్కలురాని యాశలన్ | |
| కేవల మాశ లార్చి యడకించెద వీ కుసుమమ్ము మ్లానమై పోవునొ, ధూళి రాలిపడిపోవునొ యేమొ, దళీవసంతశో భావిభవమ్ము మాపువడఁ బ్రాయపుఁ దీయని వాసనల్ నిరా శావిష మానిలాహతి విషాదపథాల నడంగిపోవఁగన్ | |