| కవితలు | దీపావళి - వేదుల సత్యనారాయణ శాస్త్రి | 21. భగ్నవీణ |
| 21. భగ్నవీణ | |
| ఆ నభోమాసబహుళ వర్షానిలములఁ బులకరించిన నీ క్రూరవిలసనమ్ము లీ యెడఁద రాచి ఱంపానఁ గోయ నెంత విరుగఁబడి నవ్వి న న్నేడిపించి తీవు | |
| ఆ విమలగౌతమీస్రవంతీ వివిక్త పులినముల నా సొదల వెళ్లఁబోసికొనఁగ నీ పదమ్ముల నౌఁదల మోపి నప్పు డెంతగా నవ్వి న న్నలయించి తీవు | |
| నాయవస్థ యెఱింగి యేనాఁడు నీవు నవ్వితివొ, మూలఁబడియె నా నాఁడె ధూళి గవిసి, తంత్రులు తెగి, మెట్లు గదలిపోయి మోవఁగా రాని యౌవనాశావిపంచి | |
| కార్తికజ్యోత్స్నలందు నేకాకి నగుచుఁ బ్రాణసంత్రాణ మీ భగ్నవీణఁ దాల్చి పాడుకొందు మౌనప్రేమబాష్పగీతి నీ తనువికాస మాత్మ జీర్ణించువరకు | |