కవితలు దీపావళి - వేదుల సత్యనారాయణ శాస్త్రి 22. దీపావళినాఁడు
22. దీపావళినాఁడు
        నిశీథిని
జగతి యీనాఁటి యీ మహోత్సవమునందు
మునిగి యానందమునఁ బొంగిపోవుచుండ
ఇటు రగులుగొల్పి రెవరు నీ హృదయమందు
నణఁచుకొనియున్న ఘోరదుఃఖానలమ్ము
        నేను
కాఱుకొన్న యమాసచీఁకటుల నడుమ
నే నొకండనె యీ శూన్యనిలయ మందు
అదురువడిపోయి, మరణవాద్యమ్ము లట్లు
గుండియలు కొట్టుకొన నేడ్చుకొనుచు నుంటి
ఇంతగ దహించుకొనిపోవు నీ యెడంద
బాష్పములు జారిపడి చల్లఁబడునొ యనుచు
మూసికొనిపోయె నా నేత్రములు తమంత
రాత్రియే యింక బహిరంతరముల నాకు
లోన జ్వలియించుచున్న మహానలమున
కొక స్ఫులింగమె కాద యీ యుత్సవాగ్ని
శైశవ మ్మాది ప్రేమశ్మశానమైన
జీవి కొకఁనాటి కేటి దీపావళి యిఁక
విస్మృతోదంతములు శూన్యవీథులందు
నావలెనె మౌనముగ వెళ్ళిపోవుచున్న
యో నిశీథిని! నీ వినీలోదరమున
దొరకె నీ దురదృష్టవంతునకుఁ జోటు
        చిమ్మట
బాణసంచుల ఫెళఫెళార్భటులు విరిసి
దశదిశాంతరములఁ బ్రతిధ్వనుల నీన
పేదవడియున్న మౌనజీవితపుటాశ
లిపుడు మ్రోగించుకొను చుంటి వేల నీవు
        నేను
నన్ను నిరసించు వారి యానందమందు
నాకు భాగమ్ము వల దొక్కనాఁటి కైన
చీఁకటుల జీల్చుకొని వచ్చు మీకరాళ
గానరవములనే నా సుఖమ్ము గలదు
దినములు పరస్పర ప్రతిధ్వనులు గాగ
నిరువదైదేండ్ల నాబ్రదు కిట్టె గడచె
ఈ రహోదుఃఖవీథులం దే నెరుంగ
సఖుల యడుగుల జాడ లీ సరికిగూడ
ఎడతెరిపిలేని కన్నీటిజడులఁ దడిసి
పంకిలమ్మైన జీవనప్రాంగణమున
శాంతిదేవతాచరణ లాక్షారసారు
ణాంకలవలేశముల వెతుకాడుకొందు
గొంతువిప్పక లోలోనఁ గుమిలి కుమిలి
యెంతయేడ్చినఁ బగిలిపో దీ యెడంద
ఆఁకొనిన యాశ లెప్పటి కప్పు డెవియొ
కలయ ద్రిప్పును స్వప్నసాగరతటాల
మృత్యుగర్జాప్రవాహ గంభీరమైన
విధి నిదురవోవు ప్రేమజీవితములోన
సంఘటిలిన ప్రవాసదుస్స్వప్న వ్యథల
మడతలను సర్దుకొనుచుందు మాయకుండ
తెగిపడిన పూలదండ లెత్తుగ నమర్చి
యంధకారము సందిట నదుముకొనుచు
నెవరికొరకో పదేపదే యెదురుసూచు
నాయెద కొనర్తు కృత్రిమానందభిక్ష
మ్రొక్కినకొలందిఁ గాలితోఁ ద్రొక్కివేయు
నీ కఠినలోక మెల్ల బహిష్కృతమ్ము
రండు, చిమ్మటలార! ఈ రాత్రివేళ
నావలెనె పాడుకొను మీరె నాకు సఖులు
AndhraBharati AMdhra bhArati - kavitalu - dIpAvaLi - 22. dIpAvaLinA.rDu - gautamI kOkila vEdula satyanArAyaNa Sastri ( telugu andhra )