| కవితలు | దీపావళి - వేదుల సత్యనారాయణ శాస్త్రి | 20. ప్రవాసి |
| 20. ప్రవాసి | |
| నా మెడలోన వైచుకొనినా నొక దుశ్శకునంపువేళ మా ప్రేమకు సూచకం బని నవీనమృణాళసరమ్ము, కాని యా దామమనోజ్ఞతల్ హృదిని దాకియుఁ దాకకమున్న తున్కలై పోముడిత్రెంచి దుర్విధి తమోమయ వీథుల వైచెఁ గ్రూరతన్ | |
| నాటి విశాలనీలగగనమ్మును, నాటి యనంతతారకా కోటులు, నాటి లేమొయిలుగుంపులు, నాటి నిశాంధకారముల్ నాటి నిశీథమందపవనమ్ములు నావలె నేడు కష్టపుం బాటునఁ జిక్కి దుఃఖపడుభంగి విరక్తములై కనంబడు\న్ | |
| ఈ పడుచుందనంపుటెద యెచ్చటికో పరువెత్తు, నెంతగా నాపుకొనం దలంచిన రహస్స్మృతు లేవొ వియోగదుఃఖవీ థీపతితమ్ము లై, హతవిధిక్షుభితప్రథమానురాగ రే ఖాపరిభూత యౌవనసుఖ స్పృహలన్ గదలించు మాటికిన్ | |
| పావన గౌతమీ పులినభాగములం దిరుగాడుచు\న్ బిపా సావిలమౌచు నాదుహృదయమ్ము తపించి తపించి వెఱ్ఱియై పోవు, నెవో రహోవిరహభుగ్న దురంత విషాదమర్మరా రావము లీ స్రవంతికతరంగముల\న్ వినవచ్చుచున్నటుల్ | |
| ప్రేమకఠోరతల్ చిదిమి పెట్టిన దుర్దివసావసానవే ళా మసృణాంధకారపటలమ్ముల చాటున దాగి యెవ్వరో కోమలతారకాద్యుతినిగూఢ రవమ్ముల రమ్మటంచు న\న్ వేమరుఁ బిల్చుచున్న సరణి\న్ మదిఁ దోఁచుఁ బ్రతిక్షణమ్మునన్ | |
| వెచ్చని నాయెడందఁ జెయివెట్టి కలంచిన యట్లు, సూదుల\న్ గ్రుచ్చినయట్లు, కత్తిమొనఁగోసిన యట్టులు, చూర్ణచూర్ణమౌ మచ్చున రాల మోదినటు, మండెడు నిప్పునఁ గాల్చి నట్లు, క మ్మెచ్చున లాగిన ట్లనునిమేష మెవో స్మృతు లేచియేచెడున్ | |
| ఏయెడ నేమియే మనుభవించితినో యవియెల్ల నాత్మలోఁ గోయని కోఁత లౌచు బ్రదుకున్ సుడిఁ ద్రిప్పి కలంప, వ్యర్థమై పోయిన యాశలెల్లఁ దలపోయుచు సౌహృదజీవరాగముల్ మాయనిప్రేమచిహ్నల కమర్చెద బాష్పసుమార్చనావిధుల్ | |
| నాకుఁ బ్రశాంతి లేదు, కఠినమ్మగు శూన్యమునందుఁ గ్రుంగి చీ కాకయి పోయె నాబ్రదుకు, కన్నులు విప్పిన మూసికొన్న బా ధాకలుషమ్ము లాశ లెడద\న్ విదళించును నిస్సహాయతా వ్యాకుల శోకగీతులె యహర్నిశము\న్ వినవచ్చు రోదసి\న్ | |
| నేను నిశీథి నొంటి శయనించి గభీరతమోబ్ధిసంకులో ర్మీనికరమ్ములుం బులకరింపఁగ నా తుది లేని సైపఁగా రాని ప్రవాసజీవనభరమ్ము స్మరించుచు రక్తబాష్పముల్ సోనలువార నేడ్చెద నులూకవిలోకనముల్ చెమర్పఁగ\న్ | |
| నాయెద కీ ప్రపంచ మనిన\న్ మృగతృష్ణల యింద్రజాలమై పోయెఁ, గలంతనిద్రఁ గనుమూసితి నేని మనోహరాకృతి చ్ఛాయ యెదో కనంబడుచు స్వప్నములం, బవలెల్ల దుఃఖముం బాయనియట్టి నాహృదయమర్మముల\న్ మెలివైచి త్రుంపెడు\న్ | |
| నా కిపు డెల్ల వేళల వినంబడుచుండె నకాలమృత్యుగ ర్జాకలితాట్టహాసముల సందడు లందునఁ బ్రేమవిహ్వలా శాకరుణమ్ములౌ గుసగుసల్, మఱి చైత్రశుభప్రభాతవం శీకలగాన మీశిశిరజీవనమం దిక లేనె లేదొకో! | |