| కవితలు | దీపావళి - వేదుల సత్యనారాయణ శాస్త్రి | 23. ఎపుడో |
| 23. ఎపుడో | |
| కష్టభూయిష్ఠ దుఃఖాంత కథలతోడ విసివిపోతిని పుటలు ద్రిప్పిన కొలంది; కునుకుదీప మారదు; పొడికనుల నిదుర రాదు; బరువైన యెద మనోరథము పోదు; పేద మృగముల నెత్తురు పీల్చి పీల్చి బలిసిపోయిన శ్వాపదమ్ముల విధాన వెఱఁగొలుపుఁ గాని, ఘట్టముల్ వేగ చనవు; మనుజపశువుల దౌర్జన్యమునకు లోఁగి యినుపతలుపుల చెరఁబడ్డ యనపరాధి కీర మట్టులు స్వేచ్ఛావిహారమునకు ఱెక్కలార్చుఁ బ్రాణము సుఖస్పృహలకలల; దేవతావిగ్రహము లేని తేరువోలె నీరస నిరుత్సవ నిరలంకారమైన యీ వ్యథాక్లిష్టజీవితకావ్యమునకు నంతిమాశ్వాస శాంతిసమాప్తి యెపుడొ! | |