కవితలు దీపావళి - వేదుల సత్యనారాయణ శాస్త్రి 24. గీతములు
24. గీతములు
గాఢదుఃఖాగ్నికీలలు గాల్చుకొలది
కదుప నొక వేడినిట్టూర్పుగాడ్పు నైన
ఎడతెగని యాపదల మున్క లిడినకొలది
కనుల రానీయ నొక బాష్పకణము నైన
ఆశలన్నియు భగ్నంబు లగు కొలంది
సలుప నొక రోదనపు సడిసన్న నైన
జీవనము స్వప్నశూన్యమై పోవుకొలది
జాడ లిడబోవ నొక మబ్బునీడ కైన
ప్రేమదాహాన నెడద తపించుకొలది
అమృత మొలికింతు స్మితనయనాంచలముల
నన్నుఁ గని యీ ప్రపంచమ్ము నవ్వుకొలది
తనియఁజేతు గొంతెత్తి గీతములు పాడి
AndhraBharati AMdhra bhArati - kavitalu - dIpAvaLi - 24. gItamulu - gautamI kOkila vEdula satyanArAyaNa Sastri ( telugu andhra )