| కవితలు | దీపావళి - వేదుల సత్యనారాయణ శాస్త్రి | 03. కాంక్ష |
| 03. కాంక్ష | |
| ఈ సుమజన్మ మెట్లొ ఘటియిల్లెను నా కొకనాటిపాటిదై వాసన లీను సోయగము వాయని తీయని పోడుముల్ క్షణం బో, సగమో, విచారపడఁబో నయినన్ విడివడ్డ నాయెదన్ మోసులువారు నూతనమనోరథ మామని వేడిపొంగులన్ | |
| పేదల రక్తమాంసములఁ బెంపు వహించి దయాసుధారసా స్వాదదరిద్రులైన ధనవంతుల పెద్దరికమ్ముకై మతో న్మాదము పెంచు దేవునికి మారుగ నిల్చిన రాతిబొమ్మలం దూదరవోవు పాడుబ్రదు కొక్క నిమేషము సైప నాయెదన్ | |
| తేనెలకోసమై కొదమతేటులదాటు లొనర్చు నృత్య గీ తానునయమ్ము గాని, మలయానిలు కౌఁగిటఁ బుల్కరించు సౌ ఖ్యానుభవమ్ము గాని, తరుణారుణరాగకదుష్ణచుంబన శ్రీనవకమ్ము గాని పరితృప్తి యొసంగవు నా కొకింతయున్ | |
| నాకుఁ దలంపు లేదు లలనాజనతాకబరీభరైకభూ షాకలన\న్, సతీమృదుభుజాంతరతల్పకుచోపగూహబి బ్బోకమున\న్, వధూసితకపోలగళచ్ఛ్రవణావతంసహే వాకమున\న్, విలాసినుల పాపట చెందిర కావిపూఁతల\న్ | |
| కానుకనై ధరాధిపుల కాళ్ళకడం బొరలాడి వాడిపో లేను, ధరాపరాగపటలీమలిన మ్మగు ద్వారతోరణా స్థానమునం దురింబడఁగఁ జాలను, దోసిటపేరి ఘోరకా రానరకమ్మునం దుసురు రాల్పగ లేను నిమేషరక్తికై | |
| నీచపు దాస్యవృత్తి మన నేరని శూరత మాతృదేశసే వాచరణమ్మునం దసువు లర్పణఁజేసిన వారి పార్థివ శ్రీ చెలువారు చోటఁ, దదసృగ్రుచులన్ వికసించి, వాసనల్ వీచుచు, రాలిపోవగ వలెం దదుదాత్తసమాధిమృత్తికన్ | |