కవితలు దీపావళి - వేదుల సత్యనారాయణ శాస్త్రి 04. ప్రణయమూర్తి
04. ప్రణయమూర్తి
ప్రణయమోహననీలాంబరమ్మునందు
ఱెక్క లార్చి యాషాఢవారిదము మ్రోల
ధన్యవాదమ్ము లాడు చాతకవధూటి
నాకడనె నేర్చె జీవనానందగీతి
ప్రణయహృదయానురాగవిభ్రమము వోలె
నమలతరమైన కాచపాత్రాంతరమున
వెలుఁగు దీపిక వలగొను శలభకాంత
నాకడనె నేర్చె నాత్మార్పణ మ్మొకింత
పలుకఁ దెలియఁగ దలఁపఁగా వలనుగాక
ఆత్మను దహించు ప్రణయదుఃఖాగ్ని మండి
నీలమై వంగి వాపోవు నింగినెలఁత
నాకడనె నేర్చెఁ బ్రణయప్రణామనియతి
ఆని యానని ప్రణయపుష్పాసవమ్ము
ఆర్ద్రహృదయమ్ములో విరహాగ్నిఁ గొలుప
తొడిమ వీడిన పూవుకై పడుచుతేటి
నాకడనె నేర్చె విధుర గీతాకలనము
అరుణరాగోదయోన్మీలితాంబుజమ్ము
చారుచంద్రకరస్మేరకైరవమ్ము
పవనపరిరంభపులకిత ప్రసవచయము
నాకడనె నేర్చెఁ బ్రణయహేవాకకేళి
మావితోఁపులపైఁ దొలిమబ్బునీడ
లారెడు మధుప్రవాసప్రయాణవేళ
వీడుకొలుపు పాడఁగ గొంతు విడని పికము
నాకడనె నేర్చె బ్రణయమౌన ప్రవృత్తి
ప్రణయతంత్రుల విశ్వవిపంచి నేను
శైలహృదయమ్ములోని నిర్ఝరము నేను
వసుమతీగర్భతలసరస్వతిని నేను
నాగళమ్మె వియోగసంయోగమురళి
AndhraBharati AMdhra bhArati - kavitalu - dIpAvaLi - 04. praNayamUrti - gautamI kOkila vEdula satyanArAyaNa Sastri ( telugu andhra )