| కవితలు | దీపావళి - వేదుల సత్యనారాయణ శాస్త్రి | 11. కృతజ్ఞత |
| 11. కృతజ్ఞత | |
| భస్మరాసులనుండి పావనత మేలు కొలిపినట్టి భాగీరథీజలము వోలె జన్మజన్మాల హృదయకశ్మలము నుండి ప్రాణశక్తి రగిల్చె నీపైని ప్రేమ | |
| నా నిరాలోకలోకమ్ములోన నిన్నె యుషసిగఁ దలంచుకొన్న ముహూర్తమందు అనుభవమె గాని వెలిసేయ నలవిగాని మధురవేదన ననునేనె మరచిపోదు | |
| ఇంత నెత్తావి వాసించునేని యెడఁద నెన్నిస్మృతు లెన్నికోర్కె లెన్నెన్నికలలు జగదజస్రసహస్ర వసంతలక్ష్మి యెదుర మూర్తీభవించె నా యెడఁదకొరకె | |
| అలరునకుఁబోలె నాహృదయమ్మునకును జన్మమున కొక్కటే వికాసమ్ము సకియ! వలపు వెదఁజల్లి సుఖదుఃఖములకు వెలిగ ధాత్రిగర్భానఁ గాంచు నాత్మప్రశాంతి | |
| వలచి నిను విసిగించినందులకు ఫలము ఆమరణ మేను ప్రేమగాయకుఁడ నగుదు నీవు మాత్రము పూలవెన్నెలలరేలఁ జైత్రనృత్యోత్సవముల సలుపుకొనుము | |
| నా హృదయరక్తమే లలనావిలాస లాక్షగా, నీ పదాల కలంకరింతు నీ వసంతకల్యాణైకనృత్యమందు నన్ను మనసార గాన మ్మొనర్పనిమ్ము | |