| కవితలు | దీపావళి - వేదుల సత్యనారాయణ శాస్త్రి | 10. పెంపుడు నెమలి |
| 10. పెంపుడు నెమలి | |
| మేదుర వినీల మేఘాల మేలిముసుగు వేసికొని వచ్చె శ్రావణమాసలక్ష్మి ధారుణి ధరించెఁ దొలకరి సారె యిడిన యార్ద్రపురుగుపూవుల శాద్వలాంబరమ్ము | |
| కడిమిపూల నెత్తావుల కసటు వార వృష్టిముందటి తడిగాలి వీవసాగె ఏల యింతటి చక్కదనాలవేళ నెగురులాడ రెక్కలు రావు హృదయమునకు | |
| నేఁ డిదేమొ మా పెంపుడు నెమలికొదమ గోడమదురున మెడ రాచుకొనునె గాని యురుము లురిమెడు మబ్బుల తెరువుకేసి చూడఁబోవదు పురివిప్పి యాడఁబోదు | |
| ఆడకున్ననుమానె గొంతైన విప్పి కేకవేయ దాశల గిలిగింత లడర కోడెత్రాచుల నరగించుకొనఁగ జాలు ప్రకృతి కెటు గల్గెనో యెడబాటుబరువు | |
| కన్ను తడియని మూకశోకమున ముంచి నన్ను వెత నొంచె నీ పెంచుకొన్న ప్రేమ వానకారునృత్యము చూడ వాంఛఁగొన్న నాయెదఁ బ్రవాసవేదనాచ్ఛాయ లలమె | |
| కుండపోఁతగ వర్షమ్ము గురిసె నేని తేలిపోవును పో మింటి నీలిముసుగు కాని, యెదలోని విరహదుఃఖంపుబరువు తీరుటెట్లు నాకేని, మయూరి కేని | |