| కవితలు | దీపావళి - వేదుల సత్యనారాయణ శాస్త్రి | 12. ప్రతీకారము |
| 12. ప్రతీకారము | |
| నాహృదయతృప్తికై నీ వొనర్చినట్టి కృత్రిమప్రేమగతుల లిఖించుకొనిన యీ విషాదాంతకావ్యమ్ము నిపుడు చించి కట్టెదను దీనిపుటలతో గాలిపటము | |
| త్రెంచి దూముడివైచిన దీర్ణహృదయ దుర్లభాశామృణాలతంతువునఁ గట్టి యీ నవాషాఢమాససంధ్యానిలోర్ము లం దెగురవైచి దీనితో నాడుకొందు | |
| అశ్రుపూరితమై బరువైన హృదయ పాత్రికను వంపలేక నావలెనె వగచు మబ్బుకన్నెలతో మౌనమలినగతులఁ బరుగులిడు దీనిఁ గని తృప్తిపడుదు నేను | |
| తంతు వీగతి సాగుచున్నంతవరకు నీ వినీలాభ్రవీథి ని ట్లెగురవైచి నిలకడలులేని విషమంపు విలసనములఁ గొట్టుకొను దీనిఁ గని శాంతిఁ గొందు నేను | |
| ఆశ తెగిపోయెనా, యీ యనంతసాగ రార్ద్రగర్భోజ్జ్వలద్బడబాగ్ని తోడ భస్మ మొనరింతు దీని నా భగ్నహృదయ శకలములఁ బేర్చుకొనిన కాష్ఠమ్మునందె | |