| కవితలు | దీపావళి - వేదుల సత్యనారాయణ శాస్త్రి | 47. నేడు |
| 47. నేడు | |
| హరిపదాంభోజదళదళాంతరములందు చిందువారెడు కాంతిమరందలహరి నా దరిద్రకుటీరాంగణమునఁ గ్రుమ్మ రించెఁ జైత్రప్రభాతపరీమళములు | |
| నీలిమంటల పొగకెరటాలఁ గురియు కారుమబ్బుల చిమ్మచీకటులత్రోవఁ దిరుగులాడిన వేసట దీరిపోయె నమృతసౌందర్యలోకవాతాయనాగ తానుకూలానిలము సోకినంత నేడు | |
| పూలచిరునవ్వులో పొంగిపోవు పొలుపు గాలియూర్పుల చిఱుతరంగాల వలపు చివురుజొంపాల వెచ్చని కవుగిలింత పులుగుగొంతుక తీయని పులకరింత నేడె నా హృదయమ్ములో నిండిపోయె | |
| తప్పి పోయిన స్వప్న సౌందర్యపథము పారవైచిన చిరతరప్రణయమురళి వెదకికొని వచ్చినట్లు లభించె నేడు యుగయుగమ్ముల మధువిభాతోత్సవముల పిలుపుతోడ మోయగలేని వలపుతోడ మురళి నూదుచు నీ మనోహరపథాన సంభ్రమాశ్చర్యకర సుఖస్వప్నశాంతి సంతతానందమయ నూత్నసత్యకాంతి పాడుకొందును తాండవ మాడుకొందు నా కుటీర మానందనందనము నేడు | |