కవితలు దీపావళి - వేదుల సత్యనారాయణ శాస్త్రి 33. మురళి
33. మురళి
నీ గీతి విశ్వమంతా గొంతువిడి పాడు
నీతోడ ప్రాణలీలాతాండవ మ్మాడు
        ఓ దివ్యగాయకా
        ఓ ప్రాణనాయకా
ఏది ఇంకొక్కమా రూదరా నీమురళి
నాలోనె నేడు బృందావనము విరిసినది
నాలోన నేడె యమునాతటిని మొరసినది
        ఏ వసంతానిలమొ
        ఏ గాన కలకలమొ
ఈ నా యెడదనిండా నిండిపోయినది
        ఓ దివ్యగాయకా
        ఓ ప్రాణనాయకా
ఏది ఇంకొక్కమా రూదరా నీమురళి
ఆనందలేశమైనా నోచుకోలేదు
రా, నాప్రవాసపాషాణజీవనము
        భాగ్యసుమవాసనలొ
        పుణ్యఫలమాధురులొ
నీ పాటతీపి నేడే పొంగుచున్నవిర
        ఓ దివ్యగాయకా
        ఓ ప్రాణనాయకా
ఏది ఇంకొక్కమా రూదరా నీమురళి
AndhraBharati AMdhra bhArati - kavitalu - dIpAvaLi - 33. muraLi - gautamI kOkila vEdula satyanArAyaNa Sastri ( telugu andhra )